చందంపేట(దేవరకొండ), జూన్ 16 : రాష్ట్రంలో హైబ్రిడ్ సీఎం రేవంత్‌రెడ్డి పాలన నడుస్తున్నదని.. మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. నల్లగొండ జిల్లా దేవరకొండలో మంగళవారం సర్‌పై బూత్ లెవల్ ఏజెంట్ల అవగాహన సదస్సుకు మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, నల్లగొండ ఇన్చార్జి చింతల వెంకటేశ్వర్‌రెడ్డి, బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్‌తో కలిసి వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు డైరెక్షన్లో శిష్యుడు రేవంత్‌రెడ్డి తెలంగాణలో యాక్షన్ చేస్తున్నారని దుయ్యబట్టారు.
తెలంగాణలో రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమని, కేసీఆర్ సీఎం కావాలని ఇక్కడ ప్రజలు బలంగా నమ్ముతున్నారని పేర్కొన్నారు. ఇతర రాష్ర్టాల్లో ఓట్లను కొల్లగొట్టిన బీజేపీ ఈ సారి తెలంగాణలో కాంగ్రెస్‌తో కుమ్మక్కై ఓట్లను తొలగించే కుట్రకు పాల్పడుతున్నదని దుయ్యబట్టారు. దీనిపై బీఆర్ఎస్ శ్రేణులు ఓటర్లను అప్రమత్తం చేయాలని సూచించారు. సీఎం రేవంత్‌రెడ్డి హైడ్రా పేరుతో లక్షల ఇండ్లు కూలగొట్టి నిరుపేదలను నిరాశ్రయులను చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.