ప్రభుత్వ స్థలాలను కాపాడటమే తమ ధ్యేయమని జబ్బలు చరుచుకున్న హైడ్రా.. దర్జాగా ప్రభుత్వ స్థలంలో వంద ఫీట్ల రోడ్డుతో అక్రమార్కులు వీరంగం వేస్తుంటే ‘రంగ..రంగా.. అని ముసుగులో దాగి కూర్చున్నది.ప్రజల ప్రయోజనాలను కాపాడుతామని ప్రమాణంచేసి బాధ్యతలు స్వీకరించిన సివిల్ సర్వెంట్లు సీఎస్ మొదలుకొని ఐఏఎస్ దాకా.. కనీసం తోటి ఉద్యోగులకు అన్యాయం జరుగుతున్నదన్న కనికరం కూడా లేకుండా కావాలని కండ్లు మూసుకొని అక్రమార్కులకు వంతపాడుతున్నారు.
రూ.9 వేల కోట్ల విలువైన తన భూమినే అక్రమార్కులు చెరబట్టినా.. ఈ ప్రభుత్వానికి పట్టడం లేదు! ఎవరికీ చీమకుట్టినట్టయినా లేదు!! కబ్జా పర్వం బయటపడి పదిరోజులు దాటినా.. సర్కారు నుంచి స్పందన లేదు! పేదల్ని బెదిరించి బసవతారకనగర్ను ఖాళీ చేయిస్తున్నా.. ఎవరికీ కనిపించట్లేదు! సుప్రీంకోర్టు పేరు చెప్పి తప్పుదోవపట్టిస్తున్నా.. తలూపుడే తప్ప అడిగిన నాథుడులేడు! తప్పుడు కాగితాలతో ప్రభుత్వ భూమికే ఎసరు పెడుతున్నా.. ఏ అధికారికీ పట్టడం లేదు! గన్‌పాయింట్‌లో బెదిరింపులకు దిగినా.. పోలీసులూ వెళ్లలేదు! ఇదేమని అడగలేదు!! భూమిని కాపాడాలని ఉద్యోగులే ఆందోళన చేస్తున్నా.. అటు చూసినోళ్లు లేరు! రాత్రికి రాత్రే అక్కడ కంటైనర్లు వెలిసినా.. కట్టడి చేసిన వాళ్లు లేరు! 100 ఫీట్ల రోడ్డు బాజాప్త వేసినా.. అడ్డుకున్నవాళ్లూ లేరు! కంచే చేను మేస్తున్నది కాబట్టి.. కాపాడాల్సిన వాళ్లే కబోదులయ్యారు! కథ నడిపిస్తున్నది పెద్దలే కాబట్టి.. సర్కారీ సంరక్షకులు సైలెంటయ్యారు!
(స్పెషల్ టాస్క్బ్యూరో), హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ పెద్దలు.. ఒక శాఖ అధికారులు.. ఇద్దరూ కుమ్మక్కయితే ప్రభుత్వ భూములు పంచుకు తినొచ్చా? గతంలో ఒక కలెక్టర్ ఇచ్చిన నివేదికను చెత్తబుట్టలో వేసి ఇంకో కలెక్టర్ అందుకు విరుద్ధంగా క్లీన్చిట్ ఇవ్వొచ్చా? నాడు ఆర్డీవో లేవన్న భూములు ప్రభుత్వం మారగానే మరో ఆర్డీవోకు కనిపిస్తాయా? పాత రికార్డుల్లోనూ పుట్టుకొస్తాయా? తెర వెనక పెద్దలు ఒక్క ఫోన్ కాల్ చేస్తే ప్రైవేటు వ్యక్తులు ఎంత అరాచకం చేసినా పోలీసు శాఖ కండ్లు మూసుకుంటుందా? ప్రభుత్వంలో భాగస్వాములైన ఉద్యోగులు రోడ్డెక్కినా ప్రభుత్వం పట్టించుకోదా? మరి.. సర్కారు భూముల్లో దర్జాగా లేఅవుట్ చేస్తున్న ప్రైవేటు వ్యక్తులు 91 ఎకరాలకే పరిమితమవుతారా? మిగిలిన వందకు పైగా ఎకరాలనూ చెరపడతారా?
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపన్‌పల్లిలోని సర్వే నంబరు 36, 37లో కొనసాగుతున్న అరాచకాన్ని చూస్తే ఇలాంటి సందేహాలే వస్తాయి. సామాన్యుడికే కాదు.. ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు కలిసినపుడు సాక్షాత్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సైతం ఇలాంటి అనుమానమే వచ్చినట్టు తెలిసింది. కానీ ఏం లాభం?! రాష్ట్రంలో పాలనా అధోగతి పుణ్యమాని ప్రైవేటు వ్యక్తులు రూ.9 వేల కోట్ల భూ హారతికి రేయింబవళ్లు అక్రమంగా రహదారులు నిర్మిస్తున్నారు. అడ్డొచ్చిన వారిపైకి రివ్వాల్వర్లు ఎక్కుపెడుతున్నారు. అధికారం తోడైతే ప్రభుత్వ భూముల్ని మిఠాయిలా పంచుకు తినొచ్చని రుజువు చేస్తున్నారు.
గోపన్‌పల్లిలోని సర్వే నంబరు 36, 37లలో ప్రైవేటు వ్యక్తుల స్వైర విహారంపై రాష్ట్రవ్యాప్తంగా విస్మయం వ్యక్తమవుతున్నది. ప్రభుత్వ భూముల కోసం న్యాయ పోరాటం చేయాల్సిన ప్రభుత్వంలోని పెద్దలు సుప్రీం ఉత్తర్వుల్ని అడ్డు పెట్టుకొని ప్రైవేటు వ్యక్తుల ద్వారా వేల కోట్ల భూముల్ని కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తుండటం తీవ్ర విమర్శలకు తావిస్తున్నది. నిత్యం ఇందిరమ్మ రాజ్యం పేరుతో ప్రభుత్వ భూముల రక్షణకు భూ భారతి తీసుకువచ్చామంటూ ప్రకటనలు చేస్తున్న పెద్దలు తెర వెనక ఉండి ఈ వ్యవహారాన్ని నడిపిస్తుండటం, అధికారులంతా కీలుబొమ్మల్లా మారిపోవడంపై చూసిన వారు ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అసలు సుప్రీంకోర్టు ఉత్తర్వుల్లో ఏముంది? గతంలోని అధికారులు ఎలాంటి నివేదిక ఇచ్చారు? ఇప్పుడు అధికారులు వాటిని ఎలా తారుమారు చేస్తున్నారు? అనే దానిపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతున్నది.
అవి ప్రభుత్వ భూములేనా?
గోపన్‌పల్లిలోని సర్వే నంబరు 36, 37లలో దాదాపు 900 ఎకరాల వరకు ఉన్న భూమి పొరంబోకు అని రెవెన్యూ రికార్డుల్లో ఉంది. ఇందుకు మరో ఆధారంగా కొంతకాలం కిందట వివాదాస్పదమైన హెచ్సీయూకు చెందిన 400 ఎకరాల భూములు కూడా వీటిని ఆనుకొనే ఉన్నాయి. అంటే ఇవి కూడా ప్రభుత్వ భూములు అనడంలో ఎలాంటి సందేహం లేదు. నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనైనా, కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనైనా రెవెన్యూ అధికారులు ఇదేరీతిన అనేక నివేదికలు కూడా ఇచ్చారు. చివరకు ఇప్పుడు సాకుగా చూపుతున్న సుప్రీంకోర్టు ఉత్తర్వులు వచ్చిన తర్వాత కూడా ఈ భూములు ప్రభుత్వానివేనని వాదించారు. కానీ ఇప్పుడు అందులో 91 ఎకరాలు ప్రైవేటు వ్యక్తులకు చెందినవని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెవెన్యూ అధికారులు ప్లేటు పిరాయిస్తున్నారు. సీసీఎల్ఏ నుంచి కిందిస్థాయి గిర్దావరి వరకు గతంలో ఇచ్చిన నివేదికలను తిరగేసి తాజా నివేదికలు ఇస్తున్నారు. ఎంత అన్యాయమంటే.. సుప్రీం కోర్టుకు వెళ్లిన వారు కేవలం ఖాస్రా పహాణీలోనే తమ పేర్లు ఉన్నాయని వాదిస్తే ఇప్పుడు రెవెన్యూ అధికారులు తెర వెనక పెద్దల్ని సంతృప్తిపరిచేందుకు ఒకడుగు ముందుకేసి గతంలో వీరి పేరిట రికార్డులు కూడా ఉన్నాయని నివేదికలో పొందుపరుస్తున్నారు.
అసలు సుప్రీం కోర్టు ఏం చెప్పింది?
ఈ రెండు సర్వే నంబర్లలో తమకు 91 ఎకరాల భూములు ఉన్నాయనేది డీ నర్సింగరావు, ఇతరుల వాదన. అందుకే సుప్రీంకోర్టుకు వెళ్లారు. చివరకు 2015లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో ఆ భూములు వీరివే అని తీర్పు ఇవ్వలేదు. 1954-55 ఖాస్రా పహాణీలో వీరు తమ పేర్లు ఉన్నాయని చెప్తున్నారు. అధికారులు అవి తప్పుగా నమోదయ్యాయని అంటున్నారు. ఈ క్రమంలో ఇంత ఆలస్యంగా రికార్డులను సరిదిద్దామనే సంకుచిత కోణంలో నుంచి మేం దీనిని చూడటం లేదు. అందుకే రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవడానికైనా, ప్రొసీడింగ్స్ ఇవ్వడానికైనా స్వేచ్ఛ ఉంది. ఇందుకోసం ప్రభుత్వం సరైన న్యాయ వేదికల్ని (సివిల్ కోర్టులు) ఆశ్రయించవచ్చు అని సూచించింది. అంటే ఖాస్రా పహాణీలో సదరు ప్రైవేటు వ్యక్తుల పేర్లు పొరపాటున వచ్చాయా? మరో రకంగా వచ్చాయా? అనే వాదనలను కిందిస్థాయి కోర్టుల్లో వినిపించి, అందుకనుగుణంగా ప్రభుత్వం ముందుకుపోవచ్చని సలహా ఇచ్చిందని పలువురు న్యాయ నిపుణులు చెప్తున్నారు.
పిటిషనర్లు క్యూ కడితే ప్రభుత్వ భూములు మిగులుతాయా?
తెర వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉండటంతో గోపన్‌పల్లిలోని 91 ఎకరాల ప్రభుత్వ భూమి ఫలహారం అవుతున్నది. ఇందుకు సుప్రీంకోర్టు స్పష్టంగా సూచించకున్నా దానిని అడ్డం పెట్టుకుని రూ.9 వేల కోట్ల భూముల్ని ధారాదత్తం చేస్తున్నారు. మరి దీనిని ఆదర్శంగా తీసుకొని ప్రభుత్వ భూములపై ఉన్న కేసులకు ఇప్పుడు రెక్కలొస్తాయి. ఇదేరీతిన ప్రభుత్వంలోని పెద్దల్ని ప్రసన్నం చేసుకోవడం, అనధికారిక ఒప్పందాలు చేసుకుంటే వాటిని కూడా అధికారులు ఇదేరీతిన భుజాన వేసుకుంటారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే జరిగితే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల పరిధుల్లోని ప్రభుత్వ భూముల కోసం పిటిషనర్లు క్యూ కడతారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
మరి ఇక్కడెందుకు పోరాడరు?
కంచగచ్చిబౌలిలో హెచ్సీయూకు చెందిన 400 ఎకరాల భూములు ప్రభుత్వానివేనని 2024 ఫిబ్రవరిలో న్యాయస్థానం తీర్పునిచ్చింది. దీంతో 2023, డిసెంబరులో అధికారాన్ని చేపట్టిన అంటే మూడు నెలల ముందు అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి తాను పోరాడి సాధించిన భూములు అని ప్రగల్బాలు పలికారు. వాస్తవానికి నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వాలు, ఆ తర్వాత కేసీఆర్ ప్రభుత్వ న్యాయ పోరాటాల ఫలితంగా 2024 ఫిబ్రవరిలో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. దానిని రేవంత్ తన ఖాతాలో వేసుకున్నారు. మరి, అదే నిజమైతే వాటిని ఆనుకొని ఉన్న ఈ 91 ఎకరాల ప్రభుత్వ భూమిని ఎందుకు కాపాడటం లేదు? రేవంత్‌రెడ్డి ప్రభుత్వం న్యాయ పోరాటం ఎందుకు చేయదు? 400 ఎకరాలను కాపాడి సాధించిన వారికి ఈ 91 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడటం చాలా సులువు. కానీ ఎందుకు ఆ దిశగా అధికారులకు ఆదేశాలు పోవడం లేదు? ఎందుకు ప్రైవేటు వ్యక్తులు వీరంగం చేస్తున్నా మౌనం వహిస్తున్నారు??
అధికారులు ఏమారిస్తే ఉన్నతాధికారులు ప్రశ్నించరా?
ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చిన సమస్య కాదు. వెంటనే తేల్చాల్సిన అంశం అంతకన్నా కాదు. ఆ లెక్కకొస్తే రాష్ట్రంలో భూములపై లక్షలాది కేసులు పెండింగులో ఉన్నాయి. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాటన్నింటినీ పట్టించుకోకుండా గోపన్‌పల్లిలోని 91 ఎకరాల ప్రైవేటు వ్యక్తుల అంశాన్ని భుజాన వేసుకుందంటేనే ‘దాల్మే కుచ్ కాలా హై’ అనేందుకు నిదర్శనం. అయితే పెద్దలు చెప్పగానే వాస్తవాల్ని పరిశీలించాల్సిన అధికారులు అది చేయకపోగా గతంలో అధికారులు ఇచ్చిన నివేదికల్ని బుట్టదాఖలు చేయడమంటే ‘స్వామి కార్యం, స్వకార్యం’ అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా గతంలో రాజేంద్రనగర్ ఆర్డీవో, రంగారెడ్డి కలెక్టర్ ప్రైవేటు వ్యక్తుల భూములు ఇక్కడ లేవని, రికార్డుల్లో కనిపించడంలేదని నివేదిక ఇస్తే, ఇప్పుడు ఆ పోస్టుల్లో ఉన్న అధికారులు మాత్రం సుప్రీంకోర్టు ఆదేశానుసారంగా ఆ భూముల్ని ప్రైవేటు వ్యక్తులకు ఇస్తున్నామంటూ నివేదికలు రూపొందించారు. అంటే గత నివేదికల్ని ఏమార్చారు. మరి ప్రభుత్వాలు మారగానే అధికారులు ఇలా నివేదికల్ని ఏమార్చితే ఎగువన ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వరకు ప్రశ్నించరా? వాళ్లే మౌనంగా ఉంటే ఈ అక్రమాలను అడ్డుకునేదెవరు? ప్రభుత్వ భూముల్ని కాపాడేదెవరు?
కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది?
వాస్తవానికి ఈ వివాదం ఇప్పటిది కాదు, ఉమ్మడి రాష్ట్రంలో ఎప్పటినుంచో ఉంది. ఈ క్రమంలో 2015లో సుప్రీం తీర్పు వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ఒక విధానాన్ని ఎంచుకుంది. ఒకవైపు న్యాయపరమైన సలహాలు తీసుకుంటూనే, వాస్తవానికి సదరు ప్రైవేటు వ్యక్తులకు చెందిన భూములు, అందుకు సంబంధించిన రికార్డులు ఉన్నాయా? లేవా? అని పరిశీలించమని అధికారులకు సూచించింది. ఆ మేరకే అప్పటి రాజేంద్రనగర్ ఆర్డీవో చంద్రకళ, ఇతర అధికారులు రికార్డులను పరిశీలించడంతో పాటు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తున్న భూములు ప్రభుత్వానివే అని నివేదిక ఇచ్చారు.
బసవతారకనగర్‌లో గుడిసెలు వేసుకున్న వారిని సైతం ఆర్డీవో ఆధ్వర్యంలో అది ప్రభుత్వ భూమి అనే కారణంగా తొలగింపు ప్రక్రియ చేపడితే, ప్రభుత్వం మానవతా దృక్పథంతో వారికి పసుమాముల ప్రాంతంలో డబుల్ బెడ్రూం ఇండ్లు కూడా ఇచ్చింది. ఆర్డీవో నివేదిక ఆధారంగా అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ 4.1.2021న ప్రభుత్వానికి నివేదిక కూడా ఇచ్చారు. దీంతో ఈ రెండు సర్వే నంబర్లలో అప్పటివరకు ఖాళీగా ఉన్నది 189.11 ఎకరాలు. అది ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ ఎన్జీవో (అంటే ఇప్పుడు భాగ్యనగర్ టీఎన్జీవో)లకు ఇచ్చిన భూమి అయినందున డీ నర్సింగరావు, ఇతరులు క్లెయిమ్ చేస్తున్న ఈ భూములు ఒకటి కాదని నివేదికలో తేల్చి చెప్పారు. అంటే సదరు ప్రైవేటు వ్యక్తులు క్లెయిమ్ చేస్తున్న భూములు ఈ రెండు సర్వే నంబర్లలో ఉండొచ్చు! లేకపోవచ్చు!! కానీ ఇప్పుడు వారు ఆధీనంలోకి తీసుకుంటున్న భూమి అది కాదని గతంలో రెవెన్యూ అధికారులే నివేదికలు ఇచ్చారు.