హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ‘స్టేట్ నుంచి స్ట్రీట్ వరకు’ విచ్చలవిడిగా అవినీతి జరుగుతున్నదని మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాసర్ ధ్వజమెత్తారు. వరంగల్‌లోని కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా)భూముల వేలంలో సుమారు 70 కోట్ల రూపాయల మేర అవినీతి జరిగిందని ఆరోపించారు. మంగళవారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వినయ్ భాసర్ మాట్లాడారు. వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, కుడా చైర్మన్ వెంకట్రామిరెడ్డి తోడుదొంగల్లా మారి కుడా స్థలాలను అప్పనంగా పెద్దలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో అప్పటి కలెక్టర్ ఆమ్రపాలి కుడాకు అప్పగించిన రెండున్నర ఎకరాల విలువైన ప్రైమ్ ల్యాండ్‌ను ప్రస్తుత ఎమ్మెల్యే, కుడా చైర్మన్ కలిసి 8 ప్లాట్లుగా చేసి ఆఫ్ లైన్ వేలంలో తమ వారికి ఇప్పించుకున్నారని కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడి ఆరోపించారు. బాలసముద్రం ఏరియాలో ‘కుడా’ భూములను ఆఫ్‌లైన్‌లో వేలం వేసి కుంభకోణానికి తెరలేపారని, దీనిపై విచారణ జరిపించాలని కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు.