యాదగిరిగుట్ట, సెప్టెంబర్ 23 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి కొండపైన ప్రతి కట్టడాన్ని ఆధ్యాత్మికత ఉట్టిపడేలా పునర్నిర్మిస్తున్నారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల్లో కట్టడాలను చూసి భక్తిభావం పెంపొందాలన్న సీఎం కేసీఆర్ సంకల్పంలో మేరకు కొండపైన తెలంగాణ టూరిజం కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన హరిత హోటల్ భవనాన్ని అధునాతన హంగులతో తీర్చిదిద్దనున్నారు. ఇందుకోసం తెలంగాణ స్టేట్ టూరిజం డెవలప్ కార్పొరేషన్ లిమిటెడ్ నిధుల కింద రూ.7.70 కోట్లు మంజూరు చేసి, టెండర్లను ఆహ్వానించారు.
టెండర్ ప్రక్రియను పూర్తిచేసి త్వరలోనే పనులు ప్రారంభించనున్నట్టు టీఎస్ డిప్యూటీ ఈఈ ఆంజనేయులు తెలిపారు. ప్రస్తుత భవనంలో 32 గదులు, 2 సూట్లు ఉన్నాయి. శిథిలావస్థకు చేరిన వీటిని ఆధునీకరించనున్నారు. భవనం చుట్టూ గార్డెనింగ్ ఏర్పాటు చేయనున్నారు. పార్కింగ్ వసతి కల్పించనున్నారు. గదులతోపాటు ఆ పక్కనే అల్పాహారం, భోజనం చేసేందుకు అందుబాటులో ఉన్న హోటల్ ప్రాంగణాన్ని కూడా ఆలయ థీమ్ అనుగుణంగా మార్చనున్నారు.