హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): ఇటీవల హైదరాబాద్ శివారు అజీజ్‌నగర్‌లో పట్టుబడిన రూ.7.4 కోట్ల నగదు ఘటనలో కాంగ్రెస్ ఖమ్మం అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వర్గీయులకు పోలీసులు జారీచేసిన 41 సీఆర్పీసీ నోటీసులకు వివరణ ఇవ్వలేక ఇరుక్కుపోయినట్టు తెలుస్తున్నది. రూ.7.4 కోట్ల నగదును అక్రమంగా తరలిస్తుండగా ఈ నెల 18న అజీజ్‌నగర్‌లో సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. ఆరు కార్లలో క్యాష్ కాన్వాయ్ నిర్వహించిన 10 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారికి ఆదివారం 41 సీఆర్పీసీ నోటీసులు జారీచేసిన విషయం తెలిసిందే. నోటీసులు అందుకున్నవారిలో డబ్బును తరలిస్తూ పట్టుబడిన ఆరుగురు డ్రైవర్లుసహా నగదు వెంట ఉన్న ఇద్దరు వ్యక్తులు, శ్రీనిధి విద్యాసంస్థల అధినేత కేటీ మహితోపాటు మరో కాంగ్రెస్ నేత ఉన్నట్టు సమాచారం. కానీ, పోలీసులు మాత్రం అధికారికంగా నోటీసులు ఎవరికి జారీచేశారనేది ధ్రువీకరించలేదు. నోటీసులు అందుకున్న వారు వివరణ ఇచ్చేందుకు సోమవారం పోలీసుల ముందుకు రావాల్సి ఉండగా ఎవరూ రాలేదని విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. డబ్బు రవాణా అంశంలో ఇప్పటికే పోలీసులు కాల్‌డాటా, వాట్సాప్ చాటింగ్, జీపీఎస్ లొకేషన్, డబ్బు రవాణా చేసిన కార్ల యజమానుల వివరాలతో కూడిన పక్కా ఆధారాలను పోలీసులు సేకరించి ఐటీ అధికారులకు సమర్పించినట్టు తెలిసింది. డబ్బును ముఖ్యంగా ఖమ్మం, కొడంగల్, కామారెడ్డి, మల్కాజిగిరి తదితర నియోజకవర్గాలకు తరలించేందుకు పథకం పన్నినట్టు పోలీసుల విచారణలో తేలిందని సమాచారం. రెండు మూడు రోజుల్లో పట్టుబడిన నగదుకు సంబంధించి స్పష్టత వస్తుందని పోలీసువర్గాలు తెలిపాయి. ఈ కేసును ఐటీ, పోలీస్ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.