హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాజధాని హైదరాబాద్ నుంచి బెంగళూరు, పుణె, చెన్నైకి మూడు హైస్పీడ్ రైళ్లను మంజూరు చేసినట్టు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీవైష్ణవ్ వెల్లడించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు హైస్పీడ్ కారిడార్ గేమ్ చేంజర్‌గా మారుతుందని అభివర్ణించారు. సోమవారం పార్లమెంట్లో రైల్వే బడ్జెట్ ప్రవేశపట్టిన అనంతరం కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడారు. గంటకు 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే హైస్పీడ్ రైళ్లతో తెలంగాణ, ఏపీ, తమిళనాడు మధ్య హెల్త్, ఫైనాన్స్ టూరిజం అభివృద్ధికి అవకాశం ఉంటుందని చెప్పారు.
హైస్పీడ్ రైళ్లు అందుబాటులోకి వస్తే ఫుణెకు 1:55 గంటలు, బెంగళూరుకు 2 గంటలు, చన్నైకి 2:55 గంటల్లో చేరుకోవచ్చని తెలిపారు. తెలంగాణలో రైల్వే ప్రాజెక్టుల కోసం బడ్జెట్లో రూ.5,454 కోట్లు కేటాయించినట్టు వెల్లడించారు. ఇది ఉమ్మడి రాష్ట్రంతో పోల్చితే ఆరు రెట్లు అధికమని స్పష్టంచేశారు. తెలంగాణలో రూ. 47,984 కోట్ల విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు అమల్లో ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలోని రైల్వే నెట్‌వర్క్‌ను 100 శాతం విద్యుద్దీకరించామని తెలిపారు. భవిష్యత్‌లోనూ తెలంగాణలోని రైల్వే ప్రాజెక్టుల పూర్తికి సహకారమందిస్తామని ఆయన ప్రకటించారు.