Gas Subsidy | హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన ఎన్నికల హామీ రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకం నామ్ కే వాస్తే అన్నట్టుగా కొనసాగుతున్నది. రాష్ట్రంలో తెల్ల రేషన్‌కార్డు కలిగిన కుటుంబాలు దాదాపు 90 లక్షల వరకు ఉన్నాయి. వీరిలో ఇప్పటి వరకు 39.33 లక్షల కుటుంబాలను మాత్రమే అర్హులుగా గుర్తించింది. కానీ ఏప్రిల్ 13వ తేదీ నాటికి కేవలం 18.86 లక్షల మందికి మాత్రమే రూ. 500 గ్యాస్ సిలిండర్‌ను అందించింది. దీనిబట్టి ఎంతో గొప్పగా చెప్పుకునే గ్యాస్ పథకం కొందరికే అందుతున్నట్టు అర్థమవుతున్నది.
ఆర్థిక భారం తప్పించుకునేందుకే..
వాస్తవానికి తెల్ల రేషన్‌కార్డు ఉన్న ప్రతి కుటుంబానికీ రూ.500 గ్యాస్ పథకం వర్తించాలి. ఈ లెక్కన 90 లక్షల కుటుంబాలను అర్హులుగా గుర్తించాలి. కానీ ప్రభుత్వం 39.33 లక్షల మందినే అర్హులుగా గుర్తించింది. వాస్తవ అర్హుల్లో సగానికిపైగా కోత పెట్టింది. అంతేగాక.. అర్హులుగా గుర్తించిన వారిలోనూ సగం మందికి కూడా ఈ పథకం అందలేదు. దీంతో లబ్ధిదారులు తమకు పథకాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. స్పందించిన అధికారులు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని చెప్పి చేతులు దులుపుకుంటున్నారు. మళ్లీ దరఖాస్తు చేసినా ప్రయోజనం ఉండటం లేదు. దీంతో ఏం చెప్పాలో దిక్కుతోచని ప్రభుత్వం.. ప్రస్తుతం తొలి దశలో కొందరికే సబ్సిడీ గ్యాస్ అందుతున్నదని, అర్హులందరికీ పథకాన్ని వర్తింపజేస్తామని చెప్తున్నది. కానీ ఈ మాటల వెనుక మతలబు వేరని, ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకే కొందరికే పథకాన్ని వర్తింపజేస్తున్నదని విశ్లేషకులు చెప్తున్నారు. 90 లక్షల కుటుంబాలకు పథకాన్ని వర్తింపజేయాలంటే సంవత్సరానికి దాదాపు రూ.4000 కోట్ల వరకు భారం పడుతుందని పేర్కొన్నారు.