హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అక్రమ మద్యం ఏరులై పారుతున్నది. గ్రామాల్లో బెల్టు దుకాణాలు అక్రమ మద్యానికి అడ్డాగా మారుతున్నాయి. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ (ఎన్డీపీఎల్) దెబ్బకు డ్యూటీ పెయిడ్ మద్యం విక్రయాలు నేల చూపులు చూస్తున్నాయి. ఏకంగా 14 జిల్లాలో మద్యం విక్రయాలు పడిపోయి, రాబడి.. అంచనాల కంటే 20 శాతం తగ్గినట్టు ఎక్సైజ్ నివేదికలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రంలోని డిస్టిలరీల యాజమాన్యంతో కుమ్మక్కైన మద్యం మాఫియా యథేచ్ఛగా ఎన్డీపీఎల్ మద్యం విక్రయిస్తున్నట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. మొత్తంగా మద్యం మాఫియా సర్కారు ఖజానాకు నెలకు రూ.500 కోట్ల మేరకు గండి కొడుతున్నట్టు తెలుస్తున్నది.
భారీగా పెరిగిన బెల్టు షాప్‌లు
కొత్త మద్యం పాలసీ అమల్లోకి వచ్చిన నాటి నుంచి గ్రామాల్లో బెల్టు దుకాణాలు పెరుగుతూ వచ్చాయి. అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్రంలో నెలకు రూ.3.500 కోట్ల మద్యం వ్యాపారం జరుగుతుండగా.. ఇందులో బెల్టు దుకాణాల వాటా రూ.2000 కోట్లు ఉంటుందని అంచనా. అక్రమ మద్యంపై దాడులు నిర్వహించకుండా ఉండేందుకుగాను ఎన్ఫోర్స్మెంట్, ఎక్సైజ్, ఎస్టీఎఫ్ (స్పెషల్ టాస్క్‌ఫోర్స్)లకు ఒక్కో బెల్టుషాపుపై ప్రతి ఆరు నెలకు ఒకసారి రూ.20 వేల చొప్పున మామూళ్లు ముట్టజెప్పే విధంగా ఒప్పందం కుదిరినట్టు తెలసింది. గత జూన్ నెల నుంచి ఈ మొత్తాన్ని రూ.40వేలకు పెంచినట్టు సమాచారం. దీంతో ఎస్టీఎఫ్, ఎన్‌ఫోర్స్‌మెంటు బృందాలు హైదరాబాద్ దాటి మద్యం దుకాణాల వైపు, బెల్టు దుకాణాల వైపు వెళ్లటమే మానేశాయి. గంజాయి, డ్రగ్స్ అంటూ ధూల్‌పేట, గగన్‌పహాడ్, కాటేదాన్ ప్రాంతాల చుట్టే తిరుగుతున్నాయి.
ఎన్డీపీఎల్ మద్యం సేమ్ టు సేమ్
బెల్టు దుకాణదారులు కూడా ఎన్డీపీఎల్ మద్యంను గుర్తించే అవకాశాలు తక్కువ. రుచిలో తేడా ఉండదు. అవే సీసాలు, అవే లేబుల్స్, అవే హోలోగ్రామ్స్. డిస్టిలరీల నుంచి మద్యం కొనుగోలు చేసే టీఎస్‌బీసీఎల్ చీప్ లిక్కర్ పెట్టెకు రూ.450 లోపు, మీడియం లిక్కర్‌కు రూ.750 చొప్పున చెల్లిస్తున్నది. ఇదే పెట్టె మద్యాన్ని అన్ని సుంకాలు కలుపుకొని రూ.5,280 ఎమ్మార్పీ ధరకు విక్రయిస్తారు. డిస్టిలరీల నుంచి ఎన్డీపీఎల్ మద్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్న మాఫియా.. అదే పెట్టెను రూ.2,500 నుంచి రూ.3 వేల వరకు విక్రయిస్తున్నది. ఈ దెబ్బకు డ్యూటీ పెయిడ్ మద్యం అమ్మకాలు తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలోనే మద్యం ఉత్పత్తి, సరఫరా, విక్రయాల మీద అనుమానం వచ్చిన అప్పటి వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ టీకే శ్రీదేవి డిస్టిలరీల మీద నిఘా పెట్టారు. రెండు డిస్టిలరీల మీద దాడి చేసి అక్రమ మద్యం ఉత్పత్తి, రవాణా జరుగుతున్నట్టు గుర్తించారు. అనంతరం కొద్ది కాలానికే ఆమె అర్ధంతరంగా బదిలీ అయ్యారు.
మద్యం ధరల పెంపుపై తర్జన భర్జన
మద్యం ధరల పెంపుపై రాష్ట్ర ఎక్సైజ్ ఉన్నతాధికారులు సోమవారం సుదీర్ఘంగా సమీక్షించినట్టు తెలిసింది. దీనిపై ఇప్పటికే పలుమార్లు సమావేశమైన త్రీమెన్ కమిటీ.. ఏ స్థాయిలో మద్యం ధరలు పెంచాలో ప్రభుత్వానికి రహస్యంగా నివేదికను సమర్పించినట్టు సమాచారం. ఆ నివేదిక ఆధారంగా మద్యం ధరలు పెంచాలా? లేక ప్రభుత్వ పెద్దలు నిర్ణయించే మేరకే ధరలు పెంచాలా అన్నది ఇప్పుడు ఆబ్కారీ శాఖలో హాట్‌టాపిక్‌గా మారింది. ఎక్సైజ్‌శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీ, కమిషనర్ ఈ శ్రీధర్, కొందరు ముఖ్యమైన అధికారులతో సోమవారం ఉదయం సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. అనంతరం మద్యం ధరలు పెంచితే వచ్చే లాభనష్టాలు, ఆదాయం పెంపునకు ఇతర మార్గాలను ఓ నివేదిక రూపంలో ప్రభుత్వ పెద్దలకు పంపినట్టు సమాచారం. కనీసం 15 నుంచి 25 శాతం వరకు పెంపునకు ప్రభుత్వ పెద్దలు మొగ్గు చూపినట్టు
తెలిసింది.
గోవా నుంచి అక్రమ రవాణా?
మద్యం అమ్మకాలపై ఆదాయం తగ్గిపోవడంపై ఎక్సైజ్ అధికారుల వాదన మరోలా ఉంది. గోవా, ఢిల్లీ నుంచి ఎన్డీపీఎల్ ఎక్కువగా దిగుమతి అవుతున్నదని వారు అంటున్నారు. గత జూలైలో గోవా, ఢిల్లీ నుంచి వచ్చే విమానాలను లక్ష్యంగా చేసుకొని సోదాలు చేస్తే.. రోజుకు సగటున 150 చొప్పున ఖరీదైన మద్యం బాటిళ్లు పట్టుబడ్డాయని చెప్పారు. రోడ్డు, రైలు మార్గాలను కూడా కలుపుకుంటే రోజుకు కనీసం 600 నుంచి 800 వందల వరకు మద్యం బాటిళ్లు రవాణా అవుతున్నాయని అంటున్నారు. ఈ లెక్కన ఒక్క హైదరాబాద్ నగరంలోనే ఏడాదికి రూ.1000 కోట్ల మేర ఎన్డీపీఎల్ వ్యాపారం జరుగుతున్నదని చెప్తున్నారు. వారం రోజుల పాటు విమానాశ్రయంలో గోవా, ఢిల్లీ విమానాల రాకపోకల మీద నిఘా పెట్టగానే.. ఎయిర్‌పోర్టులో దాడులు చేయవద్దని ఇదే సీఎంవో ఆదేశించినట్టు వారు వాపోయారు.