కవాడిగూడ, ఫిబ్రవరి 17: కల్లుగీత కార్మికుల సంక్షేమానికి వచ్చే బడ్జెట్లో రూ.5 వేల కోట్లు కేటాయించాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్సహా బీసీ, కల్లుగీత కార్మిక సంఘా ల నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ తక్షణమే అమలు చేయాలని కోరారు. కల్లు గీత కార్మికుల డిమాండ్ల సాధన కోసం తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద మంగళవారం పలువురు నేతలు నిరాహారదీక్ష చేపట్టారు. తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం అధ్యక్షుడు మేకపోతుల వెంకటరమణ అధ్యక్షతన జరిగిన దీక్షలో వీ శ్రీనివాస్‌గౌడ్‌తోపాటు మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్‌గౌడ్, బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజ్‌గౌడ్, రాష్ట్ర కన్వీనర్ అయిలి వెంకన్నగౌడ్, నాయకులు దుర్గయ్యగౌడ్, బెల్లంకొండ వెంకటేశ్వర్లు తదితరులు హాజరై మద్దతు పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఐదు లక్షల కుటుంబాలు కల్లుగీత వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయని తెలిపారు.
ఆ కుటుంబాలు రూ.కోట్లాది పన్నులను ప్రభుత్వానికి చెల్లిస్తున్నా వారిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. కల్లుగీత కార్మికుల సంక్షేమం కోసం నేటికీ ప్రభుత్వం వద్ద ఒక ప్రత్యేక ప్రణాళికే లేదని ఆరోపించారు. గత బడ్జెట్లో రూ.5 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తే.. రూ.70 కోట్లు మాత్రమే కేటాయించి అందులో 17 కోట్లే ఖర్చు చేశారని మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం గీత కార్మికులకు ఆసరా పింఛన్‌ను రూ.4 వేలు ఇవ్వాలని, చనిపోయిన కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియాను రూ.10 లక్షలకు పెంచాలని, వృత్తిదారులందరికీ కాటమయ్య రక్షణ కిట్లు అందజేయాలని, పెండింగ్ ఎక్స్‌గ్రేషియాను వెంటనే విడుదల చేయాలని, భర్త చనిపోతే అతని భార్యకు పింఛన్‌ను అమలు చేయాలని, చెట్ల పెంపకానికి పంచాయతీలో ఐదెకరాల చొప్పున భూమిని గీత సొసైటీలకు కేటాయించాలని కోరారు. నీరా, తాటి, ఈత ఉత్పత్తుల పరిశ్రమలు నెలకొల్పాలని, నెక్లెస్‌రోడ్‌లో మూసివేసిన నీరా కేఫ్‌ను తెరిపించాలని డిమాండ్ చేశారు. కల్లు దుకాణాలపై ఎక్సైజ్ దాడులను నిలిపివేయాలని, జనగామ జిల్లాకు సర్వాయి పాపన్న పేరు పెట్టాలని, ట్యాంక్‌బండ్‌పై సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, ఏజెన్సీ ఏరియాల్లో కల్లు సొసైటీలను పునరుద్ధరించాలని కోరారు. కార్యక్రమంలో ఇంకా నాయకులు వెంకటనర్సయ్య, గౌని వెంకన్న, బాలగోని జయరామ్, సీతారాములు, బాలిని వెంకట్, రమేశ్‌గౌడ్, అరుణ్, మల్లయ్య, అంజిబాబు, స్కైలాబ్, రాజేశ్, మోతీలాల్, సదానంద్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.