మహబూబ్‌నగర్ : వడగండ్ల వానతో నష్టపోయిన రైతాంగానికి ప్రతి ఎకరాకు రూ. 40వేలు ఆర్థిక సహాయం (Financial Assistance) అందించాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహబూబ్ నగర్ మండల పరిధిలోని బొక్కలోని పల్లి, రామచంద్రపూర్, తెలుగు గూడెం, జమిస్తాపూర్ తదితర గ్రామాల్లో వడగండ్ల వానకు (Hailstorm) దెబ్బతిన్న పంటలను ఆదివారం ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రైతాంగం దిక్కుతోచని పరిస్థితిలో ఉందని, తిండి తిప్పలు లేకుండా నాటు పెట్టుకున్న రైతులకు కోత దశలో ఉండగా వడగండ్ల పంటలను దెబ్బతీసిందని తెలిపారు. వాన పంటలు నష్టపోతే అధికారులు ఎవరూ గ్రామానికి రాలేదని రాలేదు, కనీసం రైతులను ఓదార్చలేదని ఆరోపించారు.
అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టం అంచనా వేయాలని, ప్రతి ఎకరాకు రూ. 40 వేల చొప్పున ఆర్ధిక సహాయం అందించాలి. తక్షణ సహాయం కింద రూ . 10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వడగండ్ల వానతో తీవ్రంగా నష్టపోయిన మహిళా రైతు జ్యోతికి ఆయన ఆర్ధిక సహాయం అందించారు .
కేసీఆర్.. కేటీఆర్ దృష్టికి తీసుకెళతాం
ప్రభుత్వం ఆదుకోకుంటే రైతులకు న్యాయం జరిగే వరకు వారి పక్షాన పోరాటం చేస్తామని, సమస్యను కేసీఆర్(KCR) , కేటీఆర్ (KTR) దృష్టికి తీసుకెళతానని శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మాయమాటలతో రైతులను మోసం చేస్తుందని విమర్శించారు. రైతులకు ఇంతవరకు రైతు భరోసా రాలేదని, రుణమాఫీ చేయలేదని పేర్కొన్నారు.
ఆయన వెంటే మాజీ మంత్రి గ్రంథాలయం సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆంజనేయులు, మహబూబ్‌నగర్ మండల బీఆర్ఎస్ అధ్యక్షులు దేవేందర్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ రాజేశ్వర్ రెడ్డి, సీనియర్ నాయకులు రవీందర్ రెడ్డి, శ్రీనివాసులు, రాజగోపాల్ యాదవ్, బొక్కలోనిపల్లి మాజీ ఉప సర్పంచ్ అశోక్ గౌడ్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ తిరుపతయ్య యాదవ్, బొక్కలోనిపల్లి పార్టీ అధ్యక్షులు తిరుపతయ్య, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ చెన్నయ్య యాదవ్, పార్టీ సీనియర్ నాయకులు మారుతి గౌడ్, నాగులు, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.