మెట్పల్ల్లి, డిసెంబర్ 22 : శిథిలావస్థలో ఉన్న జగిత్యాల జిల్లా మెట్పల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు మహర్దశ పట్టబోతున్నది. కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల చొరవతో రాజ్యసభ సభ్యుడు, నమస్తే తెలంగాణ సీఎండీ దీవకొండ దామోదర్‌రావు ఎంపీ ల్యాడ్స్ నుంచి రూ.40 లక్షలు కేటాయించారు. వీటితో భవన నిర్మాణానికి మంగళవారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేయనున్నారు. పట్టణం నడిబొడ్డున 63వ జాతీయ రహదారి పక్కన ఖాదీ గ్రామోద్యోగ్ ప్రతిష్ఠాన్‌కు సంబంధించిన స్థలాన్ని విద్యాలయం కోసం అప్పట్లో కేటాయించారు. ఈ స్థలంలో నిర్మించిన ప్రభుత్వ ఉన్నత పాఠశాల భవనాన్ని 1966 జనవరి 10న అప్పటి హైదరాబాద్ ఖాదీ సమితి అధ్యక్షుడు స్వామి రామానందతీర్థ ప్రారంభించారు. 1980లో జూనియర్ కళాశాల మంజూరు కావడంతో ఇదే పాఠశాలలో తరగతులు నిర్వహిస్తున్నారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉన్నత పాఠశాల తరగతులు, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు జూనియర్ కళాశాల తరగతులను నిర్వహిస్తున్నారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ప్రత్యేక భవనం నిర్మించడంతో అందులోనే కళాశాల తరగతులను నిర్వహిస్తున్నారు. 2005 నుంచి పాత భవనంలోనే 6, 7 తరగతులను అదనంగా చేర్చి ఉన్నత పాఠశాల తరగతుల నిర్వహణ కొనసాగించారు. ఉన్నత పాఠశాల భవనం ఆరు దశాబ్దాల క్రితం నిర్మించింది కావడం, మరమ్మతులు చేపట్టకపోవడంతో శిథిలావస్థకు చేరింది. స్లాబ్ కింది భాగంలో పెచ్చులూడటం, వానలు కురిసినప్పుడు గోడలు తడిసి ముద్దవడం, తరగతి గదుల్లోకి నీరు రావడం, దుర్గంధం నెలకొనడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర అసౌకర్యానికి లోనవుతున్నారు.
ఈ క్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల పాఠశాల దుస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. శిథిలావస్థలో ఉన్న భవనం నుంచి జూనియర్ కళాశాలకు చెందిన రెండు గదులను తాత్కాలికంగా ఉన్న పాఠశాల తరగతుల నిర్వహణ కోసం కలెక్టర్ ఆదేశాలతో మార్చారు. శిథిలావస్థలో ఉన్న భవనాన్ని కూల్చివేశారు. ప్రభుత్వం భవన నిర్మాణం కోసం ఎలాంటి నిధులు విడుదల చేయకపోవడంతో ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తీసుకుని రాజ్యసభ సభ్యుడు దామోదర్‌రావు దృష్టికి తీసుకెళ్లి నిధుల మంజూరు కోసం విన్నవించారు. స్పందించిన ఆయన తన ఎంపీ ల్యాడ్స్ నుంచి నిధులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు పాత భవన స్థలంలో కొత్త భవన నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేయనున్నారు. ఉన్నత పాఠశాలకు కొత్త భవనం నిర్మించనుండటంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.