హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ) : నేత కార్మికుల రుణమాఫీ పథకానికి రూ.33 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ నుంచి నిధులు విడుదల చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నది. నిధులు డ్రాచేసి లబ్ధిదారులకు పంపిణీ చేయాలని చేనేత, జౌళిశాఖ కమిషనర్‌కు సూచించింది.
9 మంది అడ్వొకేట్లపై వేటు ; బార్ కౌన్సిల్ వెల్లడి
హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): తప్పుడు సర్టిఫికెట్లు సమర్పించి న్యాయవాదులుగా ఎన్రోల్ అయిన తొమ్మిది మందిపై రాష్ట్ర బార్‌కౌన్సిల్ చర్యలు తీసుకున్నది. ఆ న్యాయవాదులు సమర్పించిన విశ్వవిద్యాలయాల సర్టిఫికెట్లు నకిలీవని గుర్తించింది. వాళ్లు లా కోర్సు చేయలేదని కౌన్సిల్‌కు నివేదికలు అందాయని పేరొన్నది. దీనిపై సదరు న్యాయవాదులకు నోటీసులు జారీ చేసి, విచారణ పూర్తయ్యాక వారిని న్యాయవాదుల జాబితా నుంచి తొలగిస్తూ చర్యలు తీసుకున్నట్టు మంగళవారం స్పష్టంచేసింది. తెలంగాణ బార్‌కౌన్సిల్ రూల్-42 మేరకు ఆ తొమ్మిది మందిపై కమిటీ చర్యలు చేపట్టిందని కౌన్సిల్ కార్యదర్శి ప్రకటించారు. బార్‌కౌన్సిల్ చర్యలు తీసుకున్న తొమ్మిది మంది జాబితాలో అజర్ శ్రవణ్‌కుమార్, ఎం సురేఖారమణి, ఎన్ విద్యాసాగర్, సీ సిసిల్ లివింగ్స్టన్, సతీశ్ కనకట్ల, నరేశ్ సుంకర, రాజశేఖర్ చిలక, శ్రీశైలం కే, ఏ ఉదయ్‌కిరణ్ ఉన్నారు.