జయశంకర్ భూపాలపల్లి, జనవరి 11 (నమస్తే తెలంగాణ) : హనుమకొండ జిల్లాకు చెందిన రిటైర్డ్ డీడబ్ల్యూవో చిన్నయ్యకు ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ. 16 లక్షలు అందజేసింది. వివరాల్లోకి వెళితే.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో డీడబ్ల్యూవోగా పది నెలల క్రితం ఉద్యోగ విరమణ పొందిన చిన్నయ్య 3 నెలల నుంచి పేగు క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాకపోవడంతో హైదరాబాద్‌లోని దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ హాస్పిటల్ లో నెల రోజులపాటు చికిత్స పొందాడు. రూ.18 లక్షల వరకు అప్పులయ్యాయని, తనకు రావాల్సిన రూ.56 లక్షల బెనిఫిట్స్ అందించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వే డుకున్నా ఫలితం లేకుండా పోయింది. చిన్నయ్య పరిస్థితిపై స్పందించిన ‘నమస్తే తెలంగాణ’ ప్రభుత్వ తీరును ఎండగట్టింది.
నవంబర్ 21న ‘క్యాన్సర్ వచ్చినా కనికరించిన సర్కారు’, డిసెంబర్ 24న ‘నా రిటైర్మెంట్ పైసలు నాకివ్వండి ప్లీజ్’ అనే కథనాలను పతాక శీర్షికన ప్రచురించి, చిన్నయ్య దీన స్థితిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా రిటైర్డ్ ఉద్యోగులు తమకు రావాల్సిన బెనిఫిట్స్ కోసం రోడ్డెక్కారు. స్పందించిన మాజీ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ చిన్నయ్య ఇంటికి వెళ్లి పరామర్శించారు. అతడి పరిస్థితిని మాజీ మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్లగా, రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్, వారి దీనస్థితిని అసెంబ్లీలో ప్రస్తావించారు. స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం రూ.16 లక్షలు చిన్నయ్యకు అందజేసింది. దీంతో చిన్నయ్య ‘నమస్తే తెలంగాణ’కు కృతజ్ఞతలు తెలిపారు. మిగిలిన డబ్బు అందిస్తే పూర్తి చికిత్స చేయించుకొని, అప్పులు తీర్చుకుంటానని తెలిపారు.