హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): పలు శాఖల్లో నెలల తరబడి పెండింగ్ ఉన్న బిల్లుల్లో కొన్నింటిని చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నిధులు విడుదల చేసింది. అక్టోబర్ నెలకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ శాఖ పెండింగ్ బిల్లులు కలిపి రూ. 1,032 కోట్లు విడుదల చేసింది. ప్రజాభవన్‌లో ఆర్థికశాఖ అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శుక్రవారం సమీక్ష నిర్వహించారు. రూ.10 లక్షలలోపు పెండింగ్ బిల్లులను క్లియర్ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు డిప్యూటీ సీఎం చెప్పారు. ఆయన ఆదేశం మేరకు అధికారులు రూ.1,032 కోట్లు విడుదల చేశారు. అక్టోబర్ నెలకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు రూ.712 కోట్లు, పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీశాఖకు సంబంధించి రూ.320 కోట్లను విడుదల చేశారు. డిప్యూటీ సీఎంతో సమీక్షలో ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్‌కుమార్ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు.
ఒక్క ఉద్యోగులకే 8వేల కోట్ల బకాయి
ఉద్యోగుల బకాయిలు రూ.712 కోట్లు మాత్రమే ప్రభుత్వం విడుదల చేసింది. ఇంకా దాదాపు రూ.8,000 కోట్లు చెల్లించాల్సి ఉన్నది. ఇప్పటివరకు ఉద్యోగులకు వివిధ బకాయిల కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.10,000 కోట్లు చెల్లించాల్సి ఉన్నది. ఉద్యోగుల విజ్ఞాపుల మేరకు ప్రభుత్వం నెలకు రూ.700 కోట్లు చెల్లిస్తామని హామీ ఇచ్చింది. ఒక నెల రూ.700 కోట్లు, మరోసారి రూ.300 కోట్లు చెల్లించింది. తా జాగా మరో రూ.712 కోట్లు విడుదల చేసింది. మొత్తంగా దాదాపు రూ.2,000 కోట్లు చెల్లించినట్టు అంచనా. ఇంకా రూ.8,000 కోట్లు చెల్లించాల్సి ఉన్నది.