మహబూబ్‌నగర్ : రాష్ట్ర బడ్జెట్లో గీత కార్మికుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ రూ.100 కోట్ల తో ప్రత్యేక పథకం ఏర్పాటుకు నిధుల కేటాయించడం పట్ల ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్రంలో గీత కార్మికుల సంక్షేమం ను దృష్టిలో పెట్టుకొని చెట్ల రకం పన్నును శాశ్వతంగా రద్దు చేశారన్నారు. అంతేకాకుండా గత బకాయిల ను సుమారు రూ. 8 కోట్ల ను పూర్తిగా మాఫీ చేయడం జరిగిందని శాసనసభ లో బడ్జెట్ ప్రసంగంలో మంత్రి హరీశ్ రావు వెల్లడించడాన్ని స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు.
అలాగేబడ్జెట్ లో నీరా పాలసిలో భాగంగా రూ.20 కోట్ల ను కేటాయించినందుకు ఆనందాన్ని వ్యక్తం చేశారు. సుమారు రూ. 8 కోట్లతో హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్ లో నిర్మించిన నీరా కేఫ్ ను త్వరలో ప్రారంభిస్తామన్నారు. యాదాద్రి జిల్లాలో నందనంలో నిర్మిస్తున్న నీరా సేకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. గీత కార్మికులు ప్రమాదవశాత్తు తాటి, ఈత చెట్ల నుంచి పడి మరణించిన వారికి ఎక్స్‌గ్రేషియాను రూ. 2లక్షల రూపాయల నుంచి 5 లక్షల రూపాయల కు పెంచమన్నారు.
శాశ్వతంగా అంగవైకల్యం చెందిన గీత కార్మికులకు గతంలో ఆపద్బాందు పథకం ద్వారా రూ.50 వేలను మాత్రమే ఇచ్చేవారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ నేతృత్వంలో శాశ్వత అంగవైకల్యం చెందిన గీత కార్మికులకు రూ. 50 వేల నుంచి రూ.5 లక్షల రూపాయలకు పెంచినట్లు బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించినందుకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర గీత కార్మికుల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు.