హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): ఓ ప్రముఖ కంపెనీ సీఎండీ పేరుతో మరో ప్రముఖ కంపెనీలోని అకౌంట్స్ అధికారిని రూ.1.95 కోట్లకు మోసగించిన కేసును సైబర్ సెక్యూరిటీ బ్యూరో (సీఎస్బీ) విజయవంతంగా ఛేదించింది. ఇతర ఖాతాలకు మళ్లించకముందే ఆ నిధులను ఫ్రీజ్ చేసినట్టు సీఎస్బీ డీజీ శిఖాగోయెల్ శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ కంపెనీ అకౌంట్స్ అధికారికి గత నెల 13న గుర్తుతెలియని నంబర్ నుంచి వాట్సాప్ మెసేజ్ వచ్చింది.
తనకు ఇదివరికే తెలిసిన ప్రముఖ కంపెనీ సీఎండీ ఫొటోతో ఆ మెసేజ్ రావడం, కొత్త ప్రాజెక్ట్ గురించి చెప్పడంతో నిజమేనని ఆ అధికారి నమ్మాడు. ఆ మెసేజ్ పంపిన వ్యక్తి రూ.1.95 కోట్ల నగదు చెల్లించాలని కోరడంతో అతను చెప్పిన ఖాతాకు డబ్బు ను ట్రాన్స్ఫర్ చేశాడు. కొంతకాలానికి ఆ సీఎండీని కలిసి ఆ నగదు బదిలీ వివరాలు చెప్పడంతో.. తాను అలాంటి మెసేజ్ పంపలేదని స్పష్టం చేశాడు. దీంతో అకౌంట్స్ అధికారి వెంటనే సైబర్ క్రైమ్స్ సిబ్బందికి ఫిర్యాదు చేయడంతో ఆధారాలు సేకరించి, ఆ డబ్బును ఫ్రీజ్ చేశారు. సైబర్ నేరం జరిగిన వెంటనే బాధితులు 1930 నంబర్‌కు కాల్ చేయాలని లేదా www.cyber crime.gov.inలో వివరాలు తెలియజేయాలని శిఖాగోయెల్ సూచించారు.