హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): అజారుద్దీన్‌కు మంత్రి పదవితో ముస్లిం మైనార్టీల ఓట్లకు కాంగ్రెస్ వల వేయాలనుకుంటే సీన్ రివర్స్ అయిందా? అనుకున్నదొకటైతే అయింది మరోటని కాంగ్రెస్ నేతలు ఆందోళనతో ఉన్నారా? నిజామాబాద్ రౌడీషీటర్ రియాజ్ ఎన్కౌంటర్ రాజకీయ రంగు పులుముకుందా? దవాఖానలోనే అతడిని కాల్చి చంపడంతో ముస్లిం మైనార్టీలు అభద్రతాభావంతో ఉన్నారా? రియాజ్ పట్టుబడిన రోజునే వాట్సాప్ యూనివర్సీలు ఎన్కౌంటర్ జరిగిందని ప్రచారం చేసినప్పుడే అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర అభ్యంతరం తెలిపారా? అతడిని ఎన్కౌంటర్ చేయొద్దని సీఎంను అభ్యర్థించారా? అయినా వినకుండా మరుసటి రోజు అతడిని కాల్చి చంపారంటూ అసదుద్దీన్ తీవ్ర అభ్యంతరం తెలిపారా? కాంగ్రెస్ పాలనలో ఫాయిదా ఏమీ లేదని ముస్లింలు బలంగా నమ్ముతున్నారా? కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల వారు అంతర్గతంగా ఆగ్రహంతో ఉన్నారా? ఈ సెగల నుంచి తప్పించుకోవడానికే అజార్‌కు మంత్రి పదవి ఇచ్చారా? పుండు మీద కారం చల్లినట్టు ఆయనకు మంత్రి పదవిపై అసద్ మండిపడ్డారా? కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని శపథం చేశారా? అంటే అవును అనే సమాధానమే వినిపిస్తున్నది. ఎమ్మెల్యే టికెట్టే వద్దనుకున్న అజారుద్దీన్‌ను ఏకంగా మంత్రినే చేయడంతో అస్మదీయ ఎంఐఎం నేతలు ఎదురు తన్నినట్టు తెలిసింది. మోసం చేసిన కాంగ్రెస్‌కు జూబ్లీ ఎన్నికల్లో సహాయం చేయవద్దని నిర్ణయించుకున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.
ఎమ్మెల్యేగానే వద్దంటే
క్రికెట్‌ను వదిలేసిన తర్వాత అజారుద్దీన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్ నుంచి ఎంపీ టికెట్ ఆశించారు. ఆయన రాష్ట్ర రాజకీయాల్లోకి రావటాన్ని ఎంఐఎం మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. కాంగ్రెస్ పార్టీతో స్నేహపూర్వక రాజకీయ సంబంధాలున్న ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ అప్పట్లో అజార్ రాష్ట్రంలో అడుగుపెట్టకుండా పావులు కదిపినట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ ఆయనకు 2009 సార్వత్రిక పార్లమెంటు ఎన్నికల్లో తెలుగు రాష్ర్టాలకు దూరంగా ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి పంపింది. ఇండియన్ క్రికెటర్‌గా ఉన్న క్రేజ్‌తో 49 వేల ఓట్ల మెజారిటీతో గెలిపించారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో రాజస్థాన్‌లోని టోంక్ సవాయీ మాధోపుర్ నుంచి పోటీ చేసిన అజార్ బీజేపీ అభ్యర్థి సుఖ్బీర్సింగ్ జౌనపురియా చేతిలో 1.35 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయారు.
2023 ఎన్నికల్లో జూబ్లీహిల్స్ టికెట్ కోసం ప్రయత్నం చేయగా, ఎంఐఎం నేతలు అడ్డుకున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో జూబ్లీహిల్స్ అసెంబ్లీ సీటుకు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక్కడ నుంచి గతంలోనే తమను కాదని అజారుద్దీన్‌కు టికెట్ ఇచ్చిన నేపథ్యంలో ఈసారి ఎంఐఎం నేతలు జాగ్రత్త పడ్డారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ మైనార్టీ అభ్యర్థిని నిలబెడితే, తామూ బరిలోకి దిగుతామని కాంగ్రెస్ పార్టీకి అల్టిమేటం ఇచ్చారు. అజారుద్దీన్‌ను ఉద్దేశించే ఈ హెచ్చరికలు అని కాంగ్రెస్ వర్గాలు బహిరంగంగానే చెప్పాయి. మజ్లిస్‌ను కాదనుకుంటే అది మైనార్టీ ఓట్ల చీలికకు దారి తీయవచ్చని, తద్వారా ఓటమి మూగట్టుకుంటామని ముఖ్యనేత సన్నిహిత వర్గం మీనాక్షి నటరాజన్‌కు నూరి పోసినట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. దీంతో అజార్‌ను దూరం పెట్టి అసదుద్దీన్‌కు అనుచరుడిగా ఉన్న ఎంఐఎం నాయకుడు నవీన్‌యాదవ్‌కు టికెట్ ఇచ్చారని రాజకీయవర్గాల్లో ప్రచారం జరిగింది.
మోదీ స్కూల్ ప్రభావంతో
ఓ వైపు రాజకీయ వేడి కొనసాగుతుండగానే.. నిజామాబాద్ జిల్లాలో రౌడీషీటర్ రియాజ్ ఎన్కౌంటర్ ఘటన జరిగింది. నిజానికి రియాజ్‌ను పోలీసులు ప్రాణాలతోనే పట్టుకున్నారు. ప్రమోద్ అనే కానిస్టేబుల్ హత్యతో సంబంధం ఉందన్న ఆరోపణలో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అదే రోజున రియాజ్‌ను పోలీసులు ఎన్కౌంటర్ చేసినట్టు సోషల్ మీడియాలో వైరల్ అయింది. జాతీయ రాజకీయ పార్టీ అధ్వర్వంలో నడిచే వాట్సాప్ యూనివర్సిటీ ఈ వార్తను ప్రమోట్ చేసినట్టు ప్రచారం జరిగింది. దీనిపై స్పందించిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్.. ముఖ్యనేతకు ఫోన్ చేసి, ఎన్‌కౌంటర్‌పై క్లారిటీ ఇవ్వాలని కోరినట్టు మజ్లిస్ వర్గాలు చెప్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలో ఎలాంటి ఎన్కౌంటర్ జరగలేదని ముఖ్యనేత ఆయనకు వివరించినట్టు తెలిసింది. రియాజ్‌ను ఎన్కౌంటర్ చేసే అలోచన ఉంటే విరమించుకోవాలని ముఖ్యనేతను అసదుద్దీన్ అభ్యర్థించినట్టు తెలిసింది. ముఖ్యనేత సూచన మేరకు అదే రోజు సాయంత్రం రియాజ్ ఎన్‌కౌంటర్‌ను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ ఖండించారు.
ఆయనపై కాల్పులు జరుపలేదని స్పష్టం చేశారు. మరుసటి రోజు రియాజ్ పోలీసుల తుపాకీని లాక్కున్నాడని, ఆ సమయంలో తాము కాల్పులు జరపగా రియాజ్ చనిపోయాడని పోలీసులు ప్రకటించారు. ఈ ఘటనపై మరోసారి ముఖ్యనేతకు ఫోన్ చేసిన అసదుద్దీన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. మీరు మోదీ స్కూల్ నుంచి రాహుల్ వద్దకు ఉద్యోగానికి వచ్చింది ముస్లిం మైనార్టీ నెత్తురు చూడటానికేనా అని ఘాటుగా నిలదీసినట్టు తెలిసింది. ఈ ఎన్కౌంటర్ తర్వాత ఆయన కాంగ్రెస్‌తో అంటీముట్టనట్టుగానే ఉంటున్నారని ప్రచారం జరుగుతున్నది. అదే సమయంలో రియాజ్ ఎన్‌కౌంటర్‌కు సోషల్ మీడియా ప్రాధాన్యం ఇవ్వటంతో రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరిగింది. పోలీసులు దవాఖానలోనే కాల్చి చంపారని, ముస్లింలు అభద్రతాభావానికి లోనయ్యారని ప్రచారం జరుగుతున్నది. ముస్లింలు ఎక్కువగా ఉన్న జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలోనూ ఈ చర్చ జరగడంతో కాంగ్రెస్ అజారుద్దీన్‌ను తెరమీదకు తెచ్చినట్టు జూబ్లీహిల్స్ ముస్లిం మైనార్టీ వర్గాలు బహిరంగంగానే చర్చించుకుంటున్నాయి.
పుండు కెలికి కారం పెట్టిండు.. బీహార్‌లో చూపిస్తా!
రాష్ట్రంలో అన్నీ తామై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడుతుంటే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తమ కాళ్ల కిందకే నీళ్లు తెచ్చే ప్రయత్నం చేస్తున్నదని మజ్లిస్ అధినేత తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు తెలిసింది. రియాజ్‌ను ఎన్కౌంటర్ చేయవద్దని చెప్పినా వినకుండా చేశారని, ఎన్‌కౌంటర్‌ను ఆపలేకపోయానని.. మైనార్టీలు తన వైపు వేలెత్తి చూపిస్తున్న నేపథ్యంలో.. పుండు కెలికి కారం పెట్టినట్టు అజారుద్దీన్‌కు మంత్రి ఇవ్వడమేంటని… ఆయన తీవ్ర ఆవేశానికి లోనయినట్టు తెలిసింది.
స్నేహ హస్తం అందించినందుకు తమకు బాగానే గడ్డిపెట్టారని, కేసీఆర్ తమకేమి శత్రువు కాదని, అయినప్పటీకి కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చామని తన సన్నిహితులతో అసదుద్దీన్ అన్నట్టు తెలిసింది. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి సహాయం చేయకూడదని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. కాంగ్రెస్ పార్టీని ఇంతకు ఇంత దెబ్బతీయాలని, తమ సత్తా ఏమిటో బీహార్ ఎన్నికల్లో చూపించాలని ఆయన శపథం చేసినట్టు ఎంఐఎం వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను పూర్తిగా వదిలిపెట్టి.. బీహార్ ఎన్నికల మీద దృష్టి పెట్టినట్టు తెలిసింది. జూబ్లీహిల్స్‌లో అంతరాత్మ ప్రభోదానుసారం ఓటు వేయాలని ముస్లింలకు ఒవైసీ సూచించినట్టు మజ్లిస్ వర్గాలు పేర్కొన్నాయి.