వరంగల్ : వరంగల్ శివనగర్‌కు చెందిన రౌడీషీటర్ నజీర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఉత్తరప్రదేశ్ చెందిన నలుగురు యువకులు ఇనుప రాడ్లతో తలపై కొట్టడంతో రక్తస్రావమై నజీర్ అక్కడికక్కడే మృతి చెందాడు. వరంగల్ రైల్వే స్టేషన్ సెకండ్ ప్లాట్ ఫారం వైపు ఉన్న ఇంటి వద్ద మంగళవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. నజీర్ చనిపోయాడని నిర్ధారించుకొన్న ఉత్తరప్రదేశ్ కు చెందిన నిందితులు అక్కడి నుంచి పారి పోయారు.
మద్యం మత్తులో ప్రారంభమైన గొడవ పెరిగి.. హత్యకు దారి తీసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బతుకు దెరువు కోసం వచ్చిన ఉత్తరప్రదేశ్ చెందిన వారికి రైళ్లలో కీ చైన్స్ లాంటి చిరు వ్యాపారాల కోసం నజీర్ డబ్బు అప్పుగా ఇస్తూ వసూలు చేసుకొంటాడు. కొంతకాలం నుంచి డబ్బు ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్న వారిని మంగళవారం రాత్రి నజీర్ పట్టుకొని నిలదీశాడు. ఈ క్రమంలో యూపీ యువకులు నజీర్ ను చంపి పరారైనట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. మిల్స్ కాలనీ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.