Congress | హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రౌడీ రాజకీయానికి తెరలేచిందా? తెలంగాణలో ఫ్యాక్షన్ తరహా కక్షలు బుసకొడుతున్నాయా? అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే అంటున్నాయి. రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షాన్ని బలహీనం చేయాలని అధికార పక్షం ఎత్తులు వేస్తున్నది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాల్లో మొదలైన దాడుల సంస్కృతిని మెల్లమెల్లగా రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు వ్యాప్తి చేస్తున్నది. తద్వారా రాష్ట్రంలోని బీఆర్ఎస్ శ్రేణులను తమ దారికి తెచ్చుకోవాలనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ కార్యాచరణను అమలు చేస్తున్నట్టు జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జెండా ఎగురవేయాలంటే క్షేత్రస్థాయిలో బలమైన బీఆర్ఎస్ క్యాడర్ను ఆ పార్టీ నుంచి లేకుండా చేయాలనే గట్టి ప్రయత్నాల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వంగా ప్రోత్సహిస్తున్నదని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలోనే అధికారంలోకి వచ్చీరాగానే మంత్రు లు, ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ టార్గెట్గా కా ర్యాచరణ మొదలుపెట్టారు. ‘మనం బలపడాలంటే వాళ్లు (బీఆర్ఎస్) బలహీనం కావాలి. ఏం చేస్తారో మీ ఇష్టం’ అని వారి నియోజకవర్గాల్లోని కాంగ్రెస్ ముఖ్యనేతలను పురమాయించినట్టు సమాచారం. అన్ని జిల్లాల్లో బీఆర్ఎస్ కార్యకర్తలే లక్ష్యంగా జరుగుతున్న దాడులకు ఆదేశాలే ప్రధాన కారణమని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని కొల్లాపూర్లో బీఆర్ఎస్లో చురుకైన కార్యకర్త మల్లేశ్యాదవ్ను భూతగాదాల ముసుగులో ఆ పార్టీ గూండాలే హతమార్చారని, తన భర్త మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన భార్య నిర్మల ఏకంగా డీజీపీని వేడుకున్నది. రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన తర్వాత తొలి రాజకీయ హత్యగా బీఆర్ఎస్ ఆరోపించింది. కొల్లాపూర్ ఉదంతంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరింతగా రెచ్చిపోయారు. బీఆర్ఎస్ శ్రేణులను భయభ్రాంతులకు గురిచేయడం ద్వారా రాజకీయాలు చేయాలనే కార్యాచరణతో ముందుకు సాగుతున్నారని ఆ తర్వాత చోటుచేసుకుంటున్న వరు స ఘటనలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఉమ్మడి నల్లగొండ, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ సహా అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో తమకు అడ్డుచెప్తున్న బీఆర్ఎస్ క్యాడర్ను నిలువరించడమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించుకొని అమలు చేస్తున్నారు.
బీఆర్ఎస్ పార్టీని బలహీనపరచాలనే దురాలోచనతోనే కాంగ్రెస్ పార్టీ నాయకులు పథకం ప్రకారం పేట్రేగిపోతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందుకు పోలీసులు తమ సంపూర్ణ సహకారాన్ని అధికార పార్టీకి అందిస్తున్న ఉదంతాలు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతా ల్లో బీఆర్ఎస్ కార్యకర్తలకు ఎవరూ సహకరించొద్దని, ఒకవేళ సహకరిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయనే సంకేతాలను ఇచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ భయభ్రాంతులకు గురిచేస్తున్నది. నాగర్కర్నూల్ జిల్లాలో రత్లావత్ మంగమ్మ అనే బీఆర్ఎస్ మహిళా కార్యకర్త ఇంటిపైకి కాంగ్రెస్ గుంపు దాడికి దిగిన ఘటన రాష్ట్రంలో సంచలనం రేపింది. కామారెడ్డి జిల్లా భిక్కనూర్లో ఏకంగా పోలీస్స్టేషన్లో పోలీసుల ముందే బీఆర్ఎస్ కార్యకర్తపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి దిగారు. ఇలా అనేక చోట్ల తమ కండ్లముందే దాడులు జరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
బాధితుల పక్షాన నిలబడాల్సిన పోలీసులు బాధ్యతలను విస్మరించి అధికార పార్టీకి దాసోహమైపోతున్నారనే అపవాదును మూటగట్టుకుంటున్నారు. ఈ విషయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పోలీసులకు మెదక్ బహిరంగసభ ద్వారా హితవు పలికారు. రాజకీయాలతో పోలీసులకు ఏం పని.. మీ పని మీరు చే యండి. అధికారం ఎవరికీ శాశ్వతం కా దు. మేంపదేండ్లు అధికారంలో ఉన్నాం. మేమూ పోలీసులను అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేయాల్సి వస్తే కాంగ్రెస్లో ఒక్కరైనా ఉండేవారా? అని కేసీఆర్ ప్రశ్నించారు. తప్పుచేసిన వారిని చట్టప్రకారం శిక్షించాల్సిన పోలీసులు వారి ధర్మాన్ని నిర్వర్తించడం లేదని మండిపడ్డారు. కిందిస్థాయి పోలీసులకు డీజీపీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని కోరారు. అధికారంతో యథేచ్ఛగా దందాలు చేసే నేతలను ప్రశ్నించే గులాబీ సైనికులపై దాడులకు పాల్పడుతున్న ఘటనలు అనేకం వెలుగుచూస్తున్నాయి.