Polavaram | హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం దాగుడుమూతలు ఆడుతున్నది. గతంలో ఎన్నడూ లేనివిధంగా పోలవరం ప్రాజెక్టుపై బుధవారం ప్రత్యేకంగా ప్రగతి సమావేశం నిర్వహించాలని ప్రధాని మోదీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ముంపు, భూసేకరణపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న తెలంగాణ సహా ఇతర రాష్ర్టాలతో చర్చించేందుకు సిద్ధమయ్యారు. అయితే.. తాజాగా ఎజెండా నుంచి పోలవరం ప్రాజెక్టును తొలగించారు. వాస్తవానికి పోలవరం ప్రాజెక్టుకు త్వరగా పూర్తి చేసి బనకచర్లకు, ఆపై కావేరి బేసిన్‌కు గోదావరి జలాలను మళ్లించాలని కుట్ర పన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంతో అది నిర్ధారణ అయ్యింది. ఈ కుట్రలను ‘నమస్తే తెలంగాణ’ ఎప్పటికప్పుడు బయటపెట్టింది. మరోవైపు పోలవరం, బనచర్లతో తెలంగాణకు వాటిల్లే నష్టంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాలతో మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రజలకు వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీశారు. ఈ నేపథ్యంలోనే ప్రగతి సమావేశం నుంచి పోలవరం ఎజెండాను తొలిగించినట్టు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది.
కుట్రలను బయటపెట్టిన ‘నమస్తే’..
పోలవరం డ్యామ్ ముంపు, భూసేకరణ, పునరావాసం, ప్రజాభిప్రాయసేకరణ తదితర అంశాలపై తెలంగాణ, ఒడిశా, చత్తీస్‌గఢ్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ర్టాలతో చర్చించేందుకు ప్రధాని మోదీ బుధవారం ఢిల్లీలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఒక రాష్ర్టానికి చెందిన సాగునీటి ప్రాజెక్టుపై స్వయంగా ప్రధాని సమావేశం నిర్వహించడంపై విస్మయం వ్యక్తం చేశారు. దీనిపై లోతుగా అధ్యయనం చేస్తే భారీ కుట్రకు తెరలేపారని రాష్ట్ర సాగునీటి రంగ నిపుణులు గుర్తించారు. పోలవరం మాటున ప్రాణహిత సహా గోదావరి జలాలను తన్నుకుపోయేందుకు గోదావరి-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు ద్వారా చంద్రబాబు ప్లాన్ చేశారని విశ్లేషించారు. ఢిల్లీలో చంద్రబాబు మాట్లాడుతూ.. రూ.80వేల కోట్లతో బనకచర్ల ప్రాజెక్టును చేపడుతున్నామని, ఆర్థిక సహాయం కోసం కేంద్రానికి ప్రతిపాదనలు సమర్పించామని చెప్పడంతో కుట్ర నిజమేనని నిర్ధారించుకున్నారు. వరద జలాల ఆధారంగానే పోతిరెడ్డిపాడు చేపడుతున్నామంటూ నాడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చెప్పినట్టే, ఇప్పుడు చంద్రబాబు కూడా వృథా జలాలే బనకచర్లకు ఆధారం అంటున్నారని, దీనిని బట్టే పోతిరెడ్డిపాడు మాదిరిగా గోదావరి నదిపై తెలంగాణకు బనకచర్ల ప్రాజెక్టు పిడుగుపాటుగా మారుతుందని గుర్తించారు.
కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరంపై కోపంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మేడిగడ్డను రాజకీయ చట్రంలో ఇరికించిన సమయాన్ని చంద్రబాబు అదునుగా భావించి చక్రం తిప్పినట్టు చెప్తున్నారు. మరోవైపు తమిళనాడులోని కావేరీకి గోదావరిని అనుసంధానించేందుకు కాచుకు కూర్చున్న మోదీ ప్రభుత్వం ఇదే మంచి తరుణంగా భావించి రంగంలోకి దిగిందని అంటున్నారు. ఈ వ్యూహంలో భాగంగానే ఎన్డీఎస్ఏ నివేదిక పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం మేడిగడ్డ పునరుద్ధరణను అటకెక్కించినట్టు ఆరోపిస్తున్నారు. బనకచర్లను కేంద్రం-ఏపీ సంయుక్తంగా చెరిసగం నిధులతో పూర్తి చేసేందుకు అంతర్గతంగా నిర్ణయం జరిగినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఏపీ భరించే 50 శాతం నిధులను కూడా రుణం రూపంలో సేకరించేందుకు కేంద్రం సహకరించేలా అంగీకారం జరిగినట్టు సమాచారం. తద్వారా తెలంగాణకు దక్కాల్సిన గోదావరి జలాలను ఏపీ, తమిళనాడుకు మళ్లించేందుకు ప్రయత్నించినట్టు సాగునీటి రంగ నిపుణులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారాలపై ‘నమస్తే తెలంగాణ’ వరుస కథనాలను ప్రచురించి, కుట్రలను బహిర్గత చేసింది.
ఏజెండా నుంచి పోలవరం తొలగింపు
నమస్తే తెలంగాణ వరుస కథనాలతో కుట్రలను బయటపెట్టడం, హరీశ్‌రావు పోరాటంతో పోలవరంపై కేంద్రం వెనకడుగు వేసినట్టు తెలిసింది. ప్రగతి సమావేశం ఏజెండా నుంచి పోలవరం ప్రాజెక్టు అంశాన్ని మొత్తంగా తొలగించడమే నిదర్శనంగా చెప్తున్నారు. పోలవరంతోపాటు ఎంఎస్ఎంఈ, దీన్‌దయాల్ రూరల్ లైవ్లీ హుడ్ మిషన్, ఆయుష్మాన్ భారత్ పథకాలపై ఆయా రాష్ర్టాల ప్రధాన ప్రధాన కార్యదర్శులు, శాఖల అధికారులతో వర్చువల్‌గా భేటీ కావాలని మోదీ భావించారు.ఈ నేపథ్యంలో సీఎస్ మంగళవారం ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు. అయితే.. సమావేశం కొనసాగుతుండగానే ఎజెండా నుంచి పోలవరం అంశాన్ని తొలగించినట్టు సమాచారం వచ్చినట్టు తెలిసింది. రాజకీయంగా నష్టపోతామనే ఆలోచనతో వెనక్కి తగ్గినట్టుగా విశ్లేషకులు చెప్తున్నారు. ఇది తాత్కాలికమేనని, గుట్టుచప్పుడు కాకుండా పోలవరాన్ని కొనసాగించాలని భావిస్తున్నట్టు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.
జల హక్కులపై నిలదీసిన బీఆర్ఎస్
గోదావరి జలాలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ఏపీ సీఎం చంద్రబాబు కలిసి చేస్తున్న కుట్రలపై మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. తెలంగాణ జలహక్కుల కోసం గళమెత్తారు. ఉమ్మడి పాలనలో సాగిన జలదోపిడిని వివరిస్తూ, నేడు కాంగ్రెస్ పాలనలో మళ్లీ మొదలైందని మండిపడ్డారు. అంతా ఒక పథకం ప్రకారం జరుగుతున్నదని తెలిసినా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. తక్షణమే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి బనకచర్లను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఢిల్లీలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. అన్ని అనుమతులు ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఆర్ఈసీ, పీఎఫ్సీ నుంచి రుణాలు తీసుకొచ్చామని, ఎలాంటి అనుమతులులేని బనకచర్లకు కేంద్ర ప్రభుత్వం ఎలా రుణ సహాయం చేస్తుందని ప్రశ్నించారు. నిబంధనలు యథేచ్ఛగా ఉల్లంఘిస్తుంటే రాష్ర్టానికి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు ఎందుకు మౌనంగా ఉంటున్నారని నిలదీశారు.