హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ) : రోట్లింజన్ యూనివర్సిటీ జర్మనీలో టాప్-3 యూనివర్సిటీ కాదని జేఎన్టీయూ వీసీ టీకేకే రెడ్డి తేల్చిచెప్పారు. జేఎన్టీయూలో చెల్లించే సగం ఫీజుతోనే జర్మనీలోని టాప్-3 యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ చదువొచ్చంటూ కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. వారితో జేఎన్టీయూకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. జర్మన్ యూనివర్సిటీతో జేఎన్టీయూ చేసుకున్న ఒప్పందాలు, కోర్సుల్లో అడ్మిషన్లపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో వీసీ టీకేకే రెడ్డి మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటుచేశారు. మన దేశంలోని కోర్ కోర్సులు చదువుతున్న ఇంజినీర్లకు పెద్దగా ఉద్యోగాలు రావడం లేదని చెప్పారు.
అమెరికాలోనూ ఇదే పరిస్థితి ఉన్నదని తెలిపారు. అందుకే తాము జర్మనీ వైపు మొగ్గుచూపామని, ఎనర్జీ సిస్టమ్స్‌లో చదివిన ప్రతిఒక్కరికీ అక్కడ ఉద్యోగాలు వస్తున్నాయని తెలిపారు. జర్మన్ వర్సిటీల ఒప్పందాలపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు అధికారులు నీళ్లు నిమిలారు. కొన్నింటికి సమాధానాలను దాటవేశారు. ‘అన్నీ గుర్తుంచుకోలేం’ అంటూ మీడియా ప్రతినిధులపై అసహనం వ్యక్తంచేశారు. జర్మన్ విద్యాసంస్థలతో కుదర్చుకున్న ఒప్పందపత్రాలను త్వరలో బహిర్గతం చేస్తామని చెప్పారు. ఈ ఒప్పదంలో భాగంగా జర్మనీ వెళ్లే విద్యార్థుల భవిష్యత్తుకు పూర్తిబాధ్యత యూనివర్సిటీదేనని వీసీ హామీ ఇచ్చారు.
ఒకవేళ ఎవరైనా విద్యార్థులు చదవలేకపోతే పూర్తి బాధ్యత తామే తీసుకుంటామని జేఎన్టీయూ వీసీ టీకేకే హామీ ఇచ్చారు. జేఎన్టీయూ నుంచి బీటెక్ డిగ్రీ ఇస్తామని, రోట్లింజన్ వర్సిటీ నుంచి ఎంఎస్ డిగ్రీ ఇప్పిస్తామని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు, కేరీర్‌కు పూర్తిబాధ్యత జేఎన్టీయూదేనని స్పష్టంచేశారు. ఒకవేళ భవిష్యత్తులో ఏది జరిగినా పూర్తి బాధ్యత తమదేనని, మోసపోయిన విద్యార్థుల ఫీజులను వాపసు చేస్తామని భరోసా ఇచ్చారు.