వాంకిడి, జూలై 15: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం జైత్పూర్ అంగన్వాడీ కేంద్రంలో లబ్ధిదారులకు కుళ్లినగుడ్లు పంపిణీ చేసిన ఘటన కలకలం రేపింది. జబోరే మహేశ్ తన కుమార్తె అనన్యకు వచ్చిన 20 కోడిగుడ్లలో చాలావరకు కుళ్లినవిగా ఉండడంతో వెంటనే అంగన్వాడీ కేంద్రానికి వెళ్లి టీచర్‌ను ప్రశ్నించారు. గుడ్లను పగలగొట్టి చూడగా అన్నీ కుళ్లినవేనని తేలడంతో వీడియో తీసి సోషల్ మీడియాల్ షేర్ చేయడంతో విషయం వైరలైంది. డీవైఎఫ్ఐ, కేవీపీఎస్, ప్రజాసంఘాల నాయకులు మాట్లాడుతూ కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి బాధితుడికి ఫోన్ చేసి ఘటనపై ఆరాతీశారు. చిన్నారులకు పాడైన గుడ్లు అందకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.