భీమదేవరపల్లి, డిసెంబర్ 14: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం రంగయ్యపల్లి గ్రామ సర్పంచ్ ఎన్నికల కౌంటింగ్లో అవకతవకలు జరిగాయని సర్పంచి అభ్యర్థిగా పోటీ చేసిన ఎలబోయిన రోజా ఆరోపించారు. ఆదివారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రంగయ్యపల్లి గ్రామానికి సర్పంచ్ స్థానాన్ని జనరల్ మహిళకు కేటాయించారన్నారు. గ్రామంలో 1554 మంది ఓటర్లు ఉండగా 1210 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఈనెల 11వ తేదీన జరిగిన పోలింగ్ అనంతరం కౌంటింగ్ జరిగింది. కౌంటింగ్ కేంద్రంలో ఎవరైనా ఒకరే అభ్యర్థి లేదా ఏజెంట్ మాత్రమే ఉండాలని ఆర్వో( RO ) చెప్పినట్లు పేర్కొన్నారు. కౌంటింగ్ కేంద్రంలో పలుమార్లు కరెంటు పోయిందని, ఆ క్రమంలోనే అవకతవకలు జరిగి ఉంటాయని అనుమానం వ్యక్తం చేశారు. సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేసిన రేణుక – 9, ఎలబోయిన రోజా – 565, దాసరి శ్రీలత – 6, మండల రజిత – 602, యామ స్వరూప – 2, తిరస్కరణ – 17, నోటా – 9 ఓట్లు వచ్చినట్లు తెలిపారు. ఎన్నికల ఫలితాల్లో గోల్ మాల్ జరిగి ఉంటుందని, తిరిగి రీకౌంటింగ్ చేయాలని ఆర్వో ను మా ఏజెంట్ కోరగా, మీరు ఏజెంట్ అని, అభ్యర్థి చెబితే రీ కౌంటింగ్ చేస్తామని ఆర్వో బదులిచ్చినట్లు తెలిపారు.
దీంతో మా కౌంటింగ్ ఏజెంట్ తనను తీసుకువచ్చే లోపే ఎన్నికల ఫలితాలు వెల్లడించారని ఆవేదన వ్యక్తం చేశారు. రీ కౌంటింగ్ జరపాలని తాము డిమాండ్ చేయగా ఆర్వో, ఎంపీడీవో కోర్టులో చూసుకోవాలని సలహా ఇవ్వడం వెనుక అనుమానాలు మరింత బలాన్ని చేకూరుస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల్లో పోలైన ఓట్లను రీకౌంటింగ్ జరపాలని, కలెక్టర్ కు ఫిర్యాదు చేయడంతో పాటు రేపు ఎంపీడీవో కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కరీంబాద్ వాసులు షేక్ మౌలానా, సహద్దుల్లా, లాలు, రహీమా, కరీంబీ, రంజాన్ బీ, ఆయేషా తదితరులు పాల్గొన్నారు.