హైదరాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లా తూఫ్రాన్ మండలం వెంకటాయపల్లి శివారులో చంద్రయ్య అనే రైతు భూమిలో కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు తంత్రీవాయిద్యకళాకారుని ‘రాతిచిత్రాల తావు’ను గుర్తించారు. శుక్రవారం బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్, కోకన్వీనర్లు భద్రగిరీశ్, జయంత్ రాతిచిత్రాల గురించి వివరించారు. రెండు గుండ్లపై పేర్చిన రాతి బండలా ఈ శిలాశ్రయం ఉన్నట్టు వెల్లడించారు. ఇక్కడ కనిపించిన రాతిచిత్రాలు ఎరుపురంగులో ఉండగా, వీటిలో ఎడమవైపు రాతిగుండుపై వేసిన చిత్రాల్లో దేవుని రథం, దానికి రెండు ఎద్దులు, ఒకవైపు ముగ్గుపట్టీ అలంకరణ, మరోవైపు తీగెలవాద్యాన్ని భుజంపై పెట్టుకుని వాయిస్తున్న కళాకారుడు కనిపిస్తున్నట్టు తెలిపారు.
కుడివైపు రాతిగుండుపై రాక్షసుడు, వీరుడు పోరు చేస్తున్నట్టు బొమ్మలు ఉన్నాయని, వీటిపైన పెద్దతోక కలిగిన కోతిబొమ్మ(హనుమంతుడు), సర్పం లాంటి గీత ఉన్నట్టు చెప్పారు. రాతిచిత్రాల్లో తంత్రీవాయిద్య కళాకారుడు కనిపించడం ఇదే ప్రథమమని తెలిపారు. ఈ చిత్రాలన్నీ మధ్య చారిత్రక కాలానికి చెందినవిగా స్పష్టంచేశారు. రాతిచిత్రాల తావుకు 50 అడుగుల దూరంలో మధ్యరాతి యుగానికి చెందిన సూక్ష్మరాతి పనిముట్లు(మైక్రోలిథ్స్) దొరికాయని, మరికొంత దూరంలో పెద్ద రాతిగుండుపై పట్టీలవంటి గీతలు, పెట్రోగె్లైఫ్స్ కనిపించినట్టు వెల్లడించారు. బృందంలో రుణాకర్, నసీరుద్దీన్, గోపాల్ ఉన్నారు.