Basara Temple | నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో భారీ చోరీ జరిగింది. సరస్వతి అమ్మవారి ఆలయంలోని పై అంతస్తులో ఉన్న మహంకాళి అమ్మవారి వెండి కిరీటంతో పాటు హుండీని దుండగులు ఎత్తుకెళ్లారు. గర్భగుడి తాళాలు పగులగొట్టి మరీ ఈ దోపిడీకి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది.
మంగళవారం తెల్లవారుజామున సుప్రభాత సేవ, పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు అమ్మవారి ఆలయ ప్రధాన అర్చకుడు శ్రీనివాస్ గుడికి వచ్చిన సందర్భంగా తాళాలు పగులగొట్టి ఉండటం గుర్తించాడు. వెంటనే ఈ విషయాన్ని ఆలయ భద్రతా సిబ్బందికి సమాచారం అందించారు. ఆలయ భద్రతా సిబ్బంది ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆలయ పూజారి చేత తలుపులు తెరిపించారు. ఆ సమయంలో అమ్మవారికి అలంకరించిన వెండి కిరీటంతో పాటు హుండీని అపహరించినట్లు పోలీసులు గుర్తించారు.

Basara Temple2
కాగా, సీసీ కెమెరాలపై వస్త్రాలు కప్పి దొంగలు ఆలయంలోకి ప్రవేశించినట్లుగా పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. చోరీకి పాల్పడిన హుండీలో నుంచి డబ్బులు తీసుకుని, తర్వాత హుండీని వ్యాసగుడి సమీపంలో పడేసినట్లుగా పోలీసులు గుర్తించారు. బాసర ఆలయంలో చోరీ గురించి సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ డా.జి. జానకి షర్మిల ఘటనాస్థలిని పరిశీలించారు. చోరీ జరిగిన తీరు, సేకరించిన ప్రాథమిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీల పరిశీలన తదితర అంశాలపై అధికారులతో సమావేశమయ్యారు. కేసును అన్ని కోణాల్లో విచారించి నిందితులను త్వరితగతిన అరెస్టు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

Basara Temple3