మహబూబాబాద్ : తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతే రోడ్లకు మహర్దశ వచ్చింది. ఇప్పుడు ప్రతి పల్లెకు రోడ్లు రావడమే కాదు.. ప్రతి గ్రామంలోనూ అంతర్గత రోడ్లు కూడా నేడు అద్దంలా మెరుస్తున్నాయని, ఇదంతా కేవలం సీఎం కేసీఆర్ వల్ల మాత్రమే సాధ్యమైందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబ్లె దయాకర్ రావు అన్నారు. మంగళవారం నెల్లికుదురు మండలం సీతారాం పురం వద్ద మంత్రి రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన మాట్లాడారు.
గతంలో రోడ్లు గతుకుల మయంగా ఉండేవన్నారు. మట్టి కొట్టుకుపోయి, కంకర తేలి, నడవడానికి కూడా వీలు కాకుండా రోడ్లుండేవన్నారు. గ్రామాలకు లింకు రోడ్లు కూడా ఉండేవి కావు. ఇక గ్రామాల్లో అంతర్గత రోడ్ల పరిస్థితి అయోమయంగా ఉండేదన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పుడు రోడ్లు అద్దంలా మెరుస్తున్నాయని చెప్పారు. ఇదంతా సీఎం కేసీఆర్ చొరవ తీసుకుని చేస్తున్న అభివృద్ధిగా మంత్రి పేర్కొన్నారు.
ఒక్కో గ్రామానికి కోట్లాది రూపాయలు మంజూరవుతున్నాయని, అన్ని రకాల పథకాలు కలుపుకుంటే, ఒక్కో గ్రామానికి కోట్ల రూపాయలు వస్తున్నాయని మంత్రి వివరించారు. ఇంత అభివృద్ధి గతంలో ఎన్నడు చూడలేదన్నారు. ఒకవైపు ఇంతగా అభివృద్ధి జరుగుతుంటే, కొందరికి కండ్లకు ఇదంతా కనిపించడం లేదని పరోక్షంగా ప్రతి పక్షాలను తీవ్రంగా దుయ్యబట్టారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలోను మరిన్ని రోడ్లు వస్తాయని మంత్రి తెలిపారు. ప్రతి గ్రామానికి రోడ్లు వేయడం ద్వారా ప్రభుత్వం అభివృద్ధికి బాటలు వేస్తుందని మంత్రి చెప్పారు.