హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): గిరిజన ప్రాంతాల రోడ్ కనెక్టివిటీ కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దశలవారీగా రాష్ట్రంలోని అన్ని గిరిజన, మారుమూల ప్రాంతాల్లో బీటీ రోడ్లు వేసేందుకు నడుం బిగించింది. ఆదివాసీ గూడేలు, లంబాడీ తండాలన్నీ బీటీ రోడ్లతో అనుసంధానం చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నది. రోడ్ కనెక్టివిటీ లేని గిరిజన గూడేలు ఉండకూడదనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా గిరిజన సంక్షేమశాఖ రూపొందించిన ప్రతిపాదనలకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. తొలివిడతగా ఎస్టీ ఆవాసాలున్న 30 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 522 పనులకు రూ.477.36 కోట్లను విడుదల చేసింది. ఈ పనులు చేపట్టేందుకు వచ్చేనెల (డిసెంబర్) 15 నుంచి 31 వరకు టెండర్ల ప్రక్రియ చేపట్టి ఆరు నెలల్లో పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకున్నది. వచ్చే జనవరి మొదటివారంలో పనులు ప్రారంభించనున్నారు.రోడ్లు వేయటానికి అనువుగా ఉండే జనవరి-జూన్ మధ్యకాలంలో రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలని గిరిజన సంక్షేమశాఖ నిర్ణయించింది.
అన్ని ఆవాసాల్లో సర్వే
రాష్ట్రంలో రోడ్ కనెక్టివిటీ లేని ప్రాంతం ఉం డకూడదనే ప్రభుత్వ నిర్ణయం మేరకు గిరిజన, మారుమూల ప్రాంతాల్లో బీటీ రోడ్లులేని ఆవాసాలు ఎన్ని ఉన్నాయి? అనే విషయమై గిరిజన సంక్షేమశాఖ సర్వే చేపట్టింది. ఈ సర్వే ప్రకారం రాష్ట్రంలోని 12,475 ఆదివాసీగూడె లు, లంబాడీ తండాలు, చెంచుపెంటలు ఉం డగా వీటిలో 9440 గిరిజన ఆవాసాలకు బీటీ రోడ్ కనెక్టివిటీ ఉంది. మిగిలిన 3035 ఎస్టీ ఆవాసాలను బీటీ రోడ్లతో అనుసంధానం చే యాల్సి ఉందని తేల్చింది. ప్రాధాన్య క్రమంలో అన్ని ప్రాంతాలకు రోడ్ కనెక్టివిటీని చేపడతామని, త్వరలోనే మిగతా ఆవాసాలకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నామని గిరిజన సంక్షేమశాఖలోని ఇంజినీరింగ్ అధికారులు చెప్పారు.
గిరిజన ఆవాసాలకు వరంగా బీటీ రోడ్లు
మారుమూల గిరిజన ఆవాసాలన్నింటినీ బీటీ రోడ్లతో అనుసంధానం చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. వానలొచ్చినప్పుడు వాగులు, వంకలు, వరదలతో రాకపోకలకు ఇబ్బందులు పడే దుస్థితి రాకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఆదివాసీ గూడేలు, లంబాడీ తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన సీఎం కేసీఆర్ చిన్నచిన్న ఆవాసాలకు కూడా బ్రహ్మాండమైన రోడ్ కనెక్టివిటీ ఉండాల్సిందేనని చెప్పారు. అందుకు కావలసిన నిధులను విడుదల చేశారు.
– రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్