నిజామాబాద్, నవంబర్ 12: 60 ఏండ్ల స్వతంత్ర భారతంలో దళితుల కోసం సీఎం కేసీఆర్ చేసిన కృషి మరే ఇతర రాష్ర్టాల్లో కూడా జరుగలేదని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం నిజామాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో దళిత రత్న జే నారాయణ సంతాప సభలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యూపీ మాజీ ముఖ్యమంత్రి మాయావతి కూడా దళితుల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ చేపట్టినన్ని కార్యక్రమాలు అమలుచేయలేదని పేర్కొన్నారు. యూపీలో దళితుల స్థితి కన్నా తెలంగాణలో వారి స్థితి బాగున్నదని పేర్కొన్నారు. దళితుల అభ్యున్నతి కోసం నిరంతరం తపన పడే వ్యక్తి సీఎం కేసీఆర్ అని కొనియాడారు.