హైదరాబాద్, సెప్టెంబర్ 3(నమస్తే తెలంగాణ): రోడ్లు భవనాల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ గణపతిరెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్టు పేర్కొంటూ సోమవారమేప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి రాజీనామా లేఖను అందజేశారు. 2017లో ఉద్యోగ విరమణ చేసినప్పటికీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయనకు ఎక్స్టెన్షన్ ఇచ్చి ఆ పదవిలో కొనసాగించింది. గణపతిరెడ్డి ఆర్‌అండ్‌బీలో జాతీయ రహదారులు, భవనాల విభాగం బాధ్యతలు చూస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన సచివాలయం, కమాండ్ కంట్రోల్ భవనం, అమరవీరుల స్థూపం, అంబేద్కర్ విగ్రహం, వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన, కలెక్టరేట్లు, టిమ్స్ తదితర భవనాల నిర్మాణాల సమయంలో గణపతిరెడ్డి ఈఎన్సీగా ఉన్నారు. ఆగస్టు 27 నుంచి 31 వరకు ఆయన సెలవులపై వెళ్లొచ్చేసరికి జాతీయ రహదారులు, భవనాల విభాగం పూర్తిస్థాయి బాధ్యతలను చీఫ్ ఇంజినీర్ మధుసూదన్‌రెడ్డికి అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో మనస్తాపానికి గురై పదవికి రాజీనామా చేసినట్టు సమాచారం. మరోవైపు, వరంగల్ సూపర్ స్పెషాలిటీ, టిమ్స్ దవాఖానల నిర్మాణాల్లో కాంట్రాక్టు ఏజెన్సీతో కుదుర్చుకున్న ఒప్పందాలకు, జరిగిన నిర్మాణాలకు భారీగా వ్యత్యాసం ఉండటంతోపాటు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన వివిధ నిర్మాణాలపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో గణపతిరెడ్డి రాజీనామా చేసినట్టు ప్రచారం జరుగుతున్నది.