హైదరాబాద్, అక్టోబర్ 22(నమస్తే తెలంగాణ): పెండింగ్ బిల్లులు (Pending Bills) చెల్లించేవరకు రోడ్డు మరమ్మతు పనులు (Road Works) ముట్టుకోబోమని తెలంగాణ సివిల్ కాంట్రాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రకటించింది. అంతేకాకుండా నిర్వహణ పనుల (మెయింటెనెన్స్ వర్క్స్)కు ఎవరినీ టెండర్లు కూడా వేయనివ్వబోమని, ఒకవేళ ఎవరైనా కాంట్రాక్టు దక్కించుకున్నా పనులు చేయకుండా అడ్డుకుంటామని సంఘం నాయకులు హెచ్చరించారు. రెండేండ్లుగా పెండింగులో ఉన్న రూ. 145 కోట్ల బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం కాంట్రాక్టర్ల సంఘం ఆధ్వర్యంలో ఆర్అండ్బీ ప్రధాన కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు డీ శంకరయ్య మాట్లాడుతూ మంత్రి సహా అధికారులకు ఎన్నిసార్లు వినతిపత్రాలు సమర్పించినా ఫలితం ఉండటం లేదని, కాబట్టి ఇకనుంచి మరమ్మతు పనులు పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించామని చెప్పారు.
బిల్లులు చెల్లించకుండా ఇప్పుడు ప్రభుత్వం మళ్లీ నిర్వహణ పనుల కోసం టెండర్లు పిలిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు పేర్కొన్నారు. తాము మాత్రం పెండింగ్ బిల్లులు చెల్లించే వరకు టెండర్లలో పాల్గొనబోమని, ఎవరూ టెండర్లు వేయకుండా అడ్డుకుంటామని తేల్చి చెప్పారు. తమ యూనియన్లో సుమారు 2,000 మంది కాంట్రాక్టర్లు ఉన్నారని, పనులన్నీ రూ. 50 లక్షలలోపు విలువైనవని పేర్కొన్నారు. అప్పులు తెచ్చి పనులు చేసినా ప్రభుత్వం బిల్లులు చెల్లించకుండా సతాయిస్తుండడంతో ఇప్పటికే పలువురు కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. పెండింగ్ బిల్లులు సాధించుకునేందుకు న్యాయస్థానాన్ని ఆశ్రయించడం సహా వివిధ మార్గాల్లో ఆందోళన నిర్వహిస్తామని పేర్కొన్నారు. అనంతరం కాంట్రాక్టర్లు ఈఎన్సీకి వినతిపత్రం సమర్పించారు.
రోడ్ల బాధ్యత నుంచి తప్పుకునేందుకే ‘హ్యామ్’!
ప్రభుత్వం రోడ్ల నిర్వహణ బాధ్యతల నుంచి తప్పుకునేందుకే హ్యామ్ ప్రాజెక్టును చేపడుతున్నదని కాంట్రాక్టర్లు విమర్శించారు. చిన్నాచితకా బిల్లులే చెల్లించలేని సర్కారు హ్యామ్ ప్రాజెక్టులో చేపట్టే పనులకు 40 శాతం వాటా ఎలా భరిస్తుందని ప్రశ్నించారు. మిగిలిన 60 శాతం నిధులు కాంట్రాక్టర్లు భరిస్తే వారికి 15 సంవత్సరాల తరువాత చెల్లిస్తామని ప్రభుత్వం చెప్తున్నదని, అది ఆచరణసాధ్యం కాదని పేర్కొన్నారు. 15 ఏండ్ల తర్వా త పరిస్థితులు ఎలా ఉంటాయో ఎవరూ ఊహించలేరని, ప్రస్తుత ప్రభుత్వాన్ని నమ్మి ఎవరూ ఇంత భారీ పనులు చేపట్టే అవకాశం లేదని తేల్చి చెప్పారు. హ్యామ్ రోడ్ల ప్రాజక్టు కేవలం కాలయాపనకు మాత్రమే పనికొస్తుందని విమర్శించారు. కాగా, పెండింగు బిల్లుల చెల్లింపు కోరుతూ బుధవారం జిల్లాలవారీగా కాంట్రాక్టర్లు స్థానిక ఆర్అండ్బీ అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు.