వేములవాడ: రాష్ట్రంలో బుల్డోజర్లు రాజ్యమేలుతున్నాయి. అభివృద్ధి పేరుచెప్పి పల్లె పట్నం అనే తేడా లేకుండా ప్రతిరోజూ ఏదో ఒకచోట కూల్చివేతలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో (Vemulawada) అధికారులు భవనాలను కూల్చివేస్తున్నారు. పట్టణంలోని ప్రధాన రహదారి విస్తరణ పనులలో భాగంగా సోమవారం ఉదయం నుంచే రోడ్డుకు ఇరువైపులా బిల్డింగ్లను నేలమట్టం చేస్తున్నారు.
మొత్తం పది జేసీబీలతో పది బృందాలను ఏర్పాటు చేసిన అధికారులు.. కూల్చివేత పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. బలవంతంగా ఇండ్లు, దుకాణాలను ఖాళీ చేస్తున్నారు. కూలీలలో సామాన్లు తొలగిస్తున్నారు. ఈ సందర్భంగా భారీగా పోలీసులను మోహరించారు. ప్రధాన రోడ్డు వైపు వాహనాలు రాకుండా అమరవీరుల స్తూపం వద్ద బారికేడ్లు ఏర్పాటుచేశారు. అధికారుల చర్యలతో వ్యాపారులు రోడ్డున పడుతున్నారు. ఉన్నపలంగా ఎక్కడికి వెళ్లాలంటూ పలువురు పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నప్పటికీ, చేసేదేం లేక సామాన్లు సర్దుకుని వెళ్తున్నారు.