Road Roller | జీడిమెట్ల, జనవరి 23 (నమస్తే తెలంగాణ): విలువైన వస్తువుల కనిపిస్తే కండ్లు కప్పి మాయం చేసే దొంగలుంటారు. కానీ కొన్ని ముఠాలు ఊహించని చోరీలకు పాల్పడుతున్నాయి. కర్ణాటకకు చెందిన ఓ దొంగల ముఠా రోడ్డు రోలర్లను మాత్రమే ఎత్తుకెళ్తుంది. విడదీసి భాగాలుగా మార్చి అమ్ముకుని సొమ్ము చేసుకుంటుంది. ఇలాంటి ఓ ముఠాను జీడిమెట్ల పోలీసులు పట్టుకున్నారు. బాలానగర్‌కు చెందిన లక్ష్మణ్ రోడ్డు రోలర్ నడుపుతుంటాడు. రోజు మాదిరిగానే ఈ నెల 20న రాత్రి దూలపల్లి మార్గంలో రోడ్డు రోలర్ వాహనాన్ని నిలిపి ఇంటికి వెళ్లాడు. నలుగురు దొంగలు రోడ్డు రోలర్‌ను డీసీఎం వ్యాన్‌లో ఎక్కించుకుని ఉడాయించారు.
స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగిన పోలీసులు వ్యాన్‌ను వెంబడించి పట్టుకున్నారు. నిందితులు కర్ణాటకకు చెందిన అహ్మద్ పటేల్ (24) జహీరాబాద్‌కు చెందిన ఇబ్రహీం (31), కుత్బుల్లాపూర్‌కు చెందిన అన్వర్ (35), సత్యనారాయణ (47)గా గుర్తించారు. మరో దొంగ ముస్తాఫా పరారీలో ఉన్నాడని తెలిపారు.
గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన బాలానగర్ డీసీపీ సురేశ్‌కుమార్ కేసు వివరాలను వెల్లడించారు. గతంలోనూ ఈ ముఠా ఓ రోడ్డు రోలర్‌ను దొంగిలించి విడిభాగాలుగా మార్చి విక్రయించినట్టు దర్యాప్తులో తేలిందని చెప్పారు. వీరి వద్ద నుంచి రూ.4.5 లక్షల విలువైన రోడ్డు రోలర్, డీసీఎం, 2 క్రేన్లు, 4 సెల్ ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.