కుమ్రం భీం ఆసిఫాబాద్, మన్సూరాబాద్, మహేశ్వరం, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ): ప్రయాణాల్లో రోడ్డు ప్రమాదాలు.. పలువురికి మృత్యుమార్గాలుగా మారాయి. రాష్ట్రంలో గురువారం పలు ప్రమాదాల్లో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లోని నిజాముద్దీన్ కాలనీకి చెందిన ఆటోడ్రైవర్ జాకీర్ కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి వైద్యం కోసం నాగ్‌పూర్‌కు వెళ్లి వస్తుండగా దేవాడ సమీపంలో బ్రిడ్జి వద్ద కారు అదుపు తప్పి బ్రిడ్జిపై నుంచి కిందకు పడిపోవడంతో నలుగురు మహిళలు సల్మా బేగం, షబ్రీమ్, ఆఫ్జాబేగం, సహార అకడికకడే ప్రాణాలు వదిలారు. తీవ్ర గాయాలపాలైన ఐదుగురిని స్థానికులు చంద్రాపూర్‌లోని ప్రైవేట్ దవాఖానకు తరలించారు. ఐదుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నదని వైద్యులు తెలిపారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించడం, ఐదుగురు చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతుండటం తీవ్ర విషాదాన్ని నింపింది.
హైదరాబాద్‌లోని నాగోల్ సమీపంలోని గౌరల్లిలో జరిగిన ప్రమాదంలో మహిళ మృతి చెందింది. సీఐ మక్బూల్ జానీ కథనం ప్రకారం సూర్యాపేట జిల్లా ఎండ్లపల్లి గ్రామం బండతండాకు చెందిన సపావత్ నారాయణ భార్య పద్మ (38), పిల్లలతో కలిసి మేడిపల్లి కెనరానగర్లో నివాసముంటున్నాడు. కుం ట్లూరు నారాయణ కాలేజీలో చదువుతున్న కూతురును చూడడానికి వెళ్లిన పద్మ తిరుగు ప్రయాణంలో గౌరెల్లికి చేరుకోగానే వెనుక నుంచి అతివేగంతో వచ్చిన కారు ఢీకొట్టింది. పద్మ కిందపడిపోగా తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల పరిధిలోని శ్రీశైలం హైవేపై మహబత్నగర్ సమీపంలో మహిళ (45)ప్రమాదంలో మృతి చెందింది. మృతురాలి వివరాలు తెలియడంలేదని పోలీసులు చెప్పారు. ఐదు రోజుల క్రితం మహిళను ఏదో వాహనం ఢీకొట్టి ఉం డొచ్చని అనుమానం వ్యక్తంచేశారు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న గుర్తుతెలియని వ్యక్తిని కారు ఢీకొనడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటన అల్వాల్ పీఎస్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి సు చిత్ర నుంచి అల్వాల్‌కు నడుచుకుంటూ వెళ్తుం డగా కారు ఢీకొట్టింది. గాయాలైన అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. సంబంధీకులు 8712663259, 8712554140 నంబర్లలో సంప్రదించాలని పోలీసులు కోరారు.
రాష్ట్రంలో గురువారం మరో రెండు పెను ప్రమాదాలు తప్పాయి. నారాయణపేట జిల్లాలో విహార యాత్రకు వెళ్తున్న బస్సు బోల్తా పడిన ఘటన చోటు చేసుకున్నది. మరికల్‌లోని మణికంఠ జూనియర్ కళాశాలకు చెందిన బస్సు 40 మంది విద్యార్థులతో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. అప్పటికే ఆగిన బొలేరోకు కారు ఢీకొట్టగా, కారును కాలేజీ బస్సు ఢీకొట్టింది. వేగంగా ఢీకొట్టడంతో బోల్తా పడింది. ప్రమాదంలో 10 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. వీరిని స్థానికులు దవాఖానకు తరలించారు. విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. నారాయణపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు 30 మందితో వెళ్తుండగా చిన్నపొర్ల-కొల్లూరు మధ్య బస్సు కమాన్ పట్టీలు విరిగిపోగా పొలాల్లోకి దూసుకెళ్లింది. డ్రైవర్ కాళప్ప చాకచక్యంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. తృటిలో పెనుప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.