సిరిసిల్ల : శంషాబాద్ అవుటర్ రింగ్‌రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంపై ( Road Accident) పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR ) తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ఆరుగురు సిరిసిల్ల ( Siricilla ) వాసుల మృతి పట్ల ఆవేదనకు లోనయ్యారు.
బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ముఖ్యంగా సిరిసిల్ల బీఆర్ఎస్ నాయకులు బొల్లి రామ్మోహన్ సోదరుడు బొల్లి రాజు కుటుంబ సభ్యులు ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోవడం పట్ల సంతాపం ప్రకటించారు. బాధిత కుటుంబ సభ్యులతో ఫోన్ లో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే కేటీఆర్ తన కార్యాలయ సిబ్బందిని అప్రమత్తం చేశారు.ఘటనా స్థలానికి వెళ్లి తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని తన పీఏ మహేందర్ రెడ్డిని ఆదేశించారు.
శంషాబాద్ ఏసీపీ నాగభూషణంతో స్వయంగా మాట్లాడి ప్రమాదానికి గల కారణాలను, ఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు.బాధితులకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించడంలో ఎక్కడా జాప్యం జరగకుండా చూడాలని కోరారు.నియోజకవర్గ ప్రజల ప్రాణాలు రోడ్డు ప్రమాదాల్లో కోల్పోవడం తనను ఎంతగానో కలచివేసిందని, మృతుల కుటుంబాలకు పార్టీ పరంగా, వ్యక్తిగతంగా పూర్తి స్థాయిలో తోడుంటామని స్పష్టం చేశారు.
మృతుల కుటుంబ సభ్యులకు మాజీ ఎం.పీ ప్రగాఢ సానుభూతి
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సిరిసిల్ల పట్టణానికి చెందిన ఆరుగురు ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు మృతి చెందడం పట్ల మాజీ ఎం.పీ. బోయినపల్లి వినోద్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ రోడ్డు ప్రమాదం తనను తీవ్రంగా కలిచి వేసిందని వినోద్ కుమార్ అన్నారు.