కంది, జూలై 25: సంగారెడ్డి జిల్లా కంది మండలం తునికిల తండా సమీపంలో నాందేడ్-అకోలా జాతీయ రహదారిపై గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతులు పుల్కల్ మండలం గంగోజిపేట్ గ్రామానికి చెందిన కాశపాగ సందీప్‌కుమార్ (22), కాశపాగ నవీన్‌కుమార్ (22), గొంగ్లూర్ గ్రామానికి చెందిన సంటిపిల్ల అభిషేక్ (23)గా పోలీసులు గుర్తించారు. మృతులు మండల కేంద్రం కందిలోని అక్షయపాత్ర ఫౌండేషన్ కిచెన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. రోజులాగే విధులకు హాజరయ్యేందుకు గురువారం తెల్లవారుజామున ముగ్గురూ ఒకే బైక్‌పై బయలుదేరారు.
సుమారు 15-20 కిలోమీటర్లు ప్రయాణించిన వీరి బైక్ తునికిల తండా వద్దకు చేరుకోగానే ముందుగా వెళ్తున్న టాటా డీసీఎం వ్యాన్‌ను వెనక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. సంగారెడ్డి రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను సంగారెడ్డి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. వర్షానికి తోడు అతివేగం ప్రమాదానికి కారణమై ఉంటుందని భావిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.