వర్ధన్నపేట: వరంగల్ జిల్లాలో బుధవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. వరంగల్ సిటీ నుంచి తొర్రూరు వైపు వెళ్తున్న ఆటోను ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో ఆటోలో ఉన్న నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. ఆ తర్వాత కొద్ది సేపటికే గాయపడిన ముగ్గురిలో ఒకరు చికిత్స పొందుతూ మరణించగా, ఇవాళ మధ్యాహ్నం మరో వ్యక్తి మృతిచెందాడు. దాంతో ఘటనలో మొత్తం మృతుల సంఖ్య ఆరుకు పెరిగింది.
గాయాలతో ఉన్న మరో వ్యక్తి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇవాళ ఉదయం వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఆటో పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. కాగా, ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు హుటాహుటిన ఘటన ప్రాంతానికి చేరుకున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు.
ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. లారీ డ్రైవర్ తాగిన మైకంలో ఉండటమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక విచారణతో నిర్ధారణకు వచ్చారు. వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ అధికారులతో కలిసి ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం సీపీ ఏవీ రంగనాథ్ విలేకరులతో మాట్లాడుతూ.. ఉదయం జరిగిన ప్రమాదంలో ఘటనా స్థలంలోనే ఆటో డ్రైవర్‌తోపాటు మరో ముగ్గురు మరణించారని, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇంకో ఇద్దరు మృతిచెందారని చెప్పారు. ఆటో డ్రైవర్‌ది కరీమాబాద్ కాగా, మిగతా ఐదుగురు రాజస్థాన్‌కు చెందిన వారని సీపీ తెలిపారు.