మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నంబాల గ్రామంలో నవంబర్ 24న ఏడేండ్ల బాలిక బావిలో శవమై తేలిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో పోలీసులు లోతుగా ఆరా తీయగా స్థానికులైన శనిగారపు బాపు (52), ఉపారపు సతీశ్(40) అనే మానవ మృగాలు చెట్టుకింద ఆడుకుంటున్న సదరు బాలికను నమ్మించి, ఎత్తుకెళ్లి పత్తిచేలో లైంగికదాడికి ఒడిగట్టారు. విషయం ఎవరికైనా చెబుతుందేమోననే చంపి రాళ్లు కట్టి బావిలో పడేశారు.
మెదక్ జిల్లాలోని టేక్మాల్ ఎస్సై రాజేశ్‌కి లంచాల అధికారి అని పేరు. అతడి ఆగడాలు అన్నిఇన్నీ కావని స్థానికులు చెప్పుకునేవారు. ఓ కేసు విషయమై రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ పట్టుకుంటే స్థానికులు ఏకంగా పోలీస్ స్టేషన్ ఎదుట పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. సామాన్యులను సైతం లంచాల కోసం పట్టి పీడించే ఎస్సై పీడ విరగడైందని పండుగ చేసుకున్నారు.
ఈ ఏడాది హైదరాబాద్‌లోని సైదాబాద్ మండలంలో గంజాయి మత్తులో ఓ యువకుడు 8 ఏండ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. తల్లిదండ్రులు కూలికి వెళ్లగా స్కూల్ నుంచి వచ్చిన చిన్నారిపై తమ్ముడి ముందే పశువులా ప్రవర్తించాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఆ బాలిక కుటుంబం ఉంటున్న పరిసరాల్లో ఎంతోమంది యువకులు గంజాయి మత్తులో పలు దారుణాలకు పాల్పడుతున్నారని స్థానికులు చెబుతున్నారు.
హోంశాఖను నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి శాంతిభద్రతలపై దృష్టిపెట్టకపోవడంతో ప్రశాంత నిలయంగా ఉన్న రాష్ట్రం రెండేండ్లుగా అశాంతి.. అభద్రతా భావంతో సతమతమవుతున్నది. పదేండ్లపాటు భద్రంగా ఉన్న ప్రజల్లో ఏదో తెలియని భయాందోళన పెరుగుతున్నది. నడిరోడ్లపైనే కత్తులతో పొడుచుకోవడం, ఆడబిడ్డలను లైంగికంగా వేధించడం, కిడ్నాప్ చేయడం, రేప్‌లు పెరిగిపోవడం, పట్టపగలే చోరీలు, అర్ధరాత్రిళ్లు దోపిడీలు సమాజాన్ని కలవర పెడుతూనే ఉన్నాయి. శత్రు దుర్భేద్యంగా ఉన్న తెలంగాణలో దోపిడీ ముఠాలు తిష్టవేయడం, టన్నుల కొద్దీ డ్రగ్స్ పట్టుబడుతుండడం, దేశంలో ఏ ఉగ్రదాడులైనా తెలంగాణలో మూలాలు వెలుగుచూడడం, సైబర్ నేరగాళ్లు కోట్లాది ప్రజాసొమ్మును కాజేయడం., వంటి అంశాలు రాష్ట్ర ప్రజల భద్రతను సవాల్ చేస్తున్నాయి. గడిచిన రెండేండ్లలో భద్రంగా బతికిన రోజులెన్ని.. అంటే జనం దగ్గర సమాధానమే లేని దయనీయస్థితి.
ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్‌రెడ్డి హోంమంత్రిత్వశాఖను తన దగ్గరే అట్టిపెట్టుకున్నారు. దీంతో సీఎం పోలీసు వ్యవస్థకు కావలి కాస్తారని, అక్రమార్కుల గుండెల్లో నిద్రిస్తారని, తప్పు చేసే పోలీసులకు ముచ్చెమటలు పట్టిస్తారని ప్రజలు, పోలీసు సిబ్బందీ అనుకున్నారు. కానీ సీఎం హోం ను మాత్రం పట్టించుకోవడం లేదు. కనీస సమీక్షలు నిర్వహించకపోవడంతో శాంతిభద్రతల సమస్యలు నానాటికి పెరుగుతూనే ఉన్నాయనే విమర్శలున్నాయి. రాష్ట్రంలో ఎక్కడ చూసినా నేడు దోపిడీలు, దొంగతనాలు, హత్యలు నిత్యకృత్యమయ్యాయి. బాధితులకు అండగా ఉండాల్సిన వ్యవస్థ కొందరు నాయకులకు కొమ్ము కాస్తుండటాన్ని నిజాయితీపరులైన పోలీసులు జీర్ణించుకోలేపోతున్నారు.
తెలంగాణలో తీవ్రమైన నేరాల్లో క్రైమ్ రేట్ పెరుగుతూనే ఉన్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నడిరోడ్లపైనే పొడుచుకోవడం సర్వసాధారణం అయింది. కాల్పుల ఘటనలూ కలకలం సృష్టిస్తున్నాయి. 2024లో తీవ్రమైన నేరాల్లో అత్యధికంగా 22.53శాతం పెరిగిందని సాక్షాత్తూ పోలీసులు విడుదల చేసే వార్షిక క్రైమ్ నివేదికే స్పష్టం చేసింది. 2024లో డబ్బు కోసం చేసిన హత్యలు 83, సాధారణ హత్యలు 856, కల్పబుల్ హోమీసైడ్ 222గా నమోదు కాగా 2,945 లైంగికదాడులు జరిగాయంటే పరిస్థితి ఎంత భయానకంగా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. ఇక కిడ్నాప్‌లు 1,525 నమోదుకాగా 2023 బీఆర్ఎస్ పాలనతో పోల్చితే 2024 కాంగ్రెస్ హయాంలో భారీగా పెరిగి ఆందోళన కలిగిస్తున్నది. ఈ యేడాది చివరి వరకూ అదే ఒరవడి కొనసాగుతదని పలు నివేదికలు చెప్పడం రాష్ట్ర భద్రతను మరింత ప్రశ్నార్థకంగా మారుస్తున్నది.
అంతర్రాష్ట్ర దొంగలు తిష్టవేశారని సాక్షాత్తూ మాజీ డీజీపీ జితేందర్ క్రైమ్ రివ్యూలో చెప్పడం రాష్ట్రంలో పరిస్థితిని తేటతెల్లం చేస్తున్నది. ఆయన వార్నింగ్ ఇచ్చిన ఆ వారంలోనే హైదరాబాద్‌లో ఖజానా జ్యువెలరీస్‌లో జరిగిన దోపిడీ సంచలనంగా మారింది. 2024లో రోజుకు 78 చొప్పున దొంగతనం, దోపిడీ కేసులు (35శాతం),(42శాతం) నమోదయ్యాయి. దోపిడీ దొంగతనాల్లో 38 శాతం పెరుగుదల, రాత్రివేళ దోపిడీల్లో 19శాతం పెరుగుదల కనిపించింది. రాష్ట్రంపై పార్థీ గ్యాంగ్‌లు, చెడ్డి, భవేరియా గ్యాంగ్‌లపై దృష్టి పెట్టాలని రివ్యూలలో ఉన్నతాధికారులు ఆదేశించినా స్పందన లేదు. భారీగా ప్రజలు నగదు, నగలు నష్టపోయారు. ఇక వైట్‌కాలర్, సైబర్ మోసాల్లో 46 శాతం పెరుగుదల నమోదైంది. ప్రతిరోజూ రాష్ట్రవ్యాప్తంగా 100పైగా చీటింగ్ కేసులు నమోదవుతున్నాయి.

ఆరోగ్య భద్రతపై అందుతున్న వైద్య సేవలపై పోలీసులే అసంతృప్తిగా ఉన్నారు. ఎస్సై, సీఐ, డీఎస్పీ స్థాయి అధికారులే సైతం ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్‌లు చేయించుకుంటూ ధైర్యాన్ని కూడగట్టుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసు ఆరోగ్య భద్రతకు నిధులు సక్రమంగా విడుదల చేయకపోవడంతో ఆరోగ్య భద్రత కార్డుపై వైద్యం చేయలేమని కార్పొరేట్ ఆసుపత్రులు తేల్చి చెప్పడంతో ఎన్నో పోలీసు కుటుంబాలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డాయి. ఆరోగ్య భద్రతపై సిబ్బంది ఆగ్రహాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం పలు ఆసుపత్రులతో మాట్లాడి వైద్యం అందించేలా చర్యలు తీసుకుని కాస్త ఉపశమనం కలిగించింది. ఏదీఏమైనా పోలీసు ఆరోగ్య భద్రత నిర్వహణ తీరుపై కానిస్టేబుల్ నుంచి ఉన్నతస్థాయి అధికారుల వరకూ బాహాటంగానే పెదవివిరుస్తున్నారు. ఓ పోలీసు ఆఫీసర్ చెవి ఆపరేషన్‌కు రూ.5 లక్షలు బిల్లు కాగా భద్రత నుంచి రూ.లక్ష వస్తే మిగిలిన రూ.4 లక్షలు భరించాల్సి వచ్చిందని ఆవేదన వెలిబుచ్చారు.
ప్రభుత్వ నిర్లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోలీసు దవాఖానలకు గ్రహణం పట్టింది. నిధుల కొరత వెంటాడుతుండటంతో వాటి నిర్వహణ పడకేసింది. 15 నెలలుగా వాటిని పట్టించుకున్న వారే లేకపోవడంతో ఆసుపత్రులు ఇచ్చే మందులపైనే ఆధారపడిన పోలీసు కుటుంబాల బాధలు మరింత పెరిగాయి. విధుల్లో బిజీగా ఉండే సిబ్బంది తన కుటుంబీకులకు సరైన సమయంలో మందులు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉన్నారు. కనీసం జ్వరం, జలుబు, ఒళ్లు నొప్పులకు కూడా పోలీసు హాస్పిటళ్లలో మందులు అందుబాటులో లేవని సిబ్బంది వాపోతున్నారు. ప్రైవేట్ మెడికల్ షాపుల్లో కొన్ని బిల్లులు పెట్టి మెడికల్ రీయింబర్స్మెంట్ కోసం దరఖాస్తు చేస్తే అవి కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పోలీసుశాఖలో కొందరి అధికారులు అవినీతి శాఖకే మచ్చ తెచ్చేలా మారింది. తెలంగాణలో రెవెన్యూ, పంచాయతీ శాఖలతో పాటు పోలీసుశాఖ కూడా అవినీతిని అతిగా పులుముకోవడం అందునా టాప్ 3 స్థానంలో ఉండడం ఆందోళన కలిగించే విషయం. ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్ వరకు 22 ట్రాప్ కేసుల్లో పలువురు సీఐ, ఎస్సై, కానిస్టేబుల్ స్థాయి సిబ్బందిని ఏసీబీ పట్టుకోవడం, సగటున నెలకు రెండు, మూడు కేసులు నమోదవడం పరిస్థితికి అద్దం పడుతున్నది. మెదక్ జిల్లా టేక్మాల్ ఎస్సై ఏసీబీకి పట్టుబడితే స్థానికులు స్టేషన్ ఎదుట పటాకులు కాల్చిన అనుభవం యావత్ రాష్ర్టాన్ని ఆశ్చర్యానికి గురిచేయగా, డిపార్ట్ మెంట్ కు మచ్చ తెచ్చింది.
తెలంగాణను మత్తు మహమ్మారి పట్టి పీడిస్తున్నది. కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన యాంటీ నార్కోటిక్ బ్యూరోకు ఈగల్ ఫోర్స్‌గా నామకరణం చేసినా ఫలితాలు అంతంత మాత్రంగానే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎక్సైజ్, ఈగల్ ఫోర్స్, పోలీసుల మధ్య సమన్వయలోపం కారణంగా డ్రగ్స్ రాష్ట్రంలోకి సులువుగా వస్తున్నాయి. ఏ ఆపరేషన్ చేసినా కోట్ల రూపాయల విలువైనవి పట్టుబడుతున్నాయి. దొడ్డిదారిన గంజాయి, సింథటిక్ డ్రగ్స్ తరలుతున్నాయి. పట్టణాల నుంచి పల్లెలల వరకూ విచ్చవిడిగా గంజాయి దొరుకుతున్నా చర్యలు నామమాత్రంగా ఉంటున్నాయి. ఇటీవల రాష్ట్రంలో 12వేల కోట్ల విలువైన డ్రగ్ రాకెట్ వెలుగు చూడటం, దానిని ముంబై పోలీసులు రహస్యంగా ఛేదించడం కలకలం సృష్టించమే కాకుండా మనోళ్ల పనితనాన్ని ప్రశ్నిస్తున్నది. రాష్ట్రమంతటా పబ్‌లు, ప్రైవేటు విద్యాసంస్థలు, హాస్టళ్లు, బస్టాండ్లు, పాడుబడ్డ భవనాలు, ఆఖరికి శ్మశానాల్లో కూడా గంజాయిబాబులు రెచ్చిపోతున్నారు. ఇటీవల ఈగల్, ఎక్సైజ్ సిబ్బందికి కూడా టన్నుల్లో గంజాయి దొరుకగా, డ్రగ్స్ సంబంధిత కేసుల్లో యువతే ఎక్కువగా ఉండటం కలవరపెట్టే అంశం.
తెలంగాణలో సైబర్ నేరాలను అరికట్టడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతున్నది. క్షేత్రస్థాయిలో ప్రజలందరికీ అవగాహన కల్పించడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నది. దీంతో గతేడాది సైబర్ నేరగాళ్లు తెలంగాణ నుంచి 1,866.90 కోట్లు కొల్లగొట్టగా ఈ ఏడాదీ ఇప్పటి వరకు వందల కోట్లు కొల్లగొట్టినట్లు తెలిసింది. 2024లో సైబర్ నేరగాళ్లు దేశవ్యాప్తంగా 23,000 కోట్ల రూపాయలు దోచుకున్నట్లు గణాంకాలు చెబుతుండగా 2023తో పోలిస్తే ఇది 206 శాతం ఎకువ కావడం ఆందోళన కలిగించే విషయం. ఈ ఏడాది కూడా 8 నెలల్లోనే రాష్ట్రవ్యాప్తంగా 14,739 మంది నుంచి రూ.606.40 కోట్లు దోచుకున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. తెలంగాణలోనూ సైబర్ నేరాల రేటు దేశంలోనే అత్యధికంగా 40.3 శాతానికి చేరింది. పౌరుల నగదును సైబర్ నేరగాళ్లు దోచుకుంటున్నా ప్రభుత్వం మాత్రం రాజకీయాలకే పరిమితమవుతున్నదనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
ప్రజలకు ధైర్యం చెప్తూ అండగా నిలువాల్సిన పోలీసుల్లో కొందరు అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. ఉద్యోగ ఒత్తిళ్లకు తోడు, వ్యక్తిగత పరిస్థితులు బాధిస్తుండడంతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ప్రేమ వైఫల్యంతో కొందరు, ఇతరత్రా సమస్యలతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇలా గడిచిన రెండేళ్లలో తెలంగాణలో సుమారు 28 మంది పోలీసు సిబ్బంది (కానిస్టేబుళ్లు, ఎస్సైలు, సీఐలు) ఆత్మహత్య చేసుకున్నారంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మారిన నిబంధనలతో ఇబ్బందులు, రోజుల తరబడి కుటుంబాలకు దూరంగా ఉండాల్సి రావడం వారిని మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నట్టు తెలుస్తున్నది. వీటికి తోడు చాలీచాలని జీతాలు కూడా వారిని కుంగదీస్తున్నట్టు సమాచారం. కొందరు అధికారుల వేధింపులు ఎకువకావడంతో పలువురు ఆత్మహత్యలు చేసుకున్న ఉదంతాలు ఉన్నాయి. ఈ క్రమంలో బెటాలియన్ కానిస్టేబుళ్లు, వారి కుటుంబాలు ఏకంగా రోడ్డెక్కిన సంగతి తెలిసిందే. పోలీసుశాఖలో వరుస ఆత్మహత్యలు నమోదవుతున్నా సిబ్బందిలో మానసికంగా ధైర్యాన్ని, ైస్థెర్యాన్ని నింపేందుకు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కనీసం యూనిట్ల వారీగా సమస్యలు తెలుసుకొని, వైద్యులు, అధికారులతో కౌన్సెలింగ్ ఇవ్వాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
రాష్ట్రంలో మహిళలపై నేరాలు విపరీతంగా పెరిగాయని సీఐడీ అధికారులు ఇచ్చిన నివేదికే చెప్పింది. 2023 (జనవరి నుంచి జూన్)లో 10,848 కేసులు నమోదైతే.. 2024లో 11,088 కేసులు, 2025 లో 11,325 కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్య ఈ ఏడాది డిసెంబర్ నాటికి మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది.
