Cesarean | హైదరాబాద్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో సిజేరియన్ కాన్పులు గణనీయంగా తగ్గితే, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో మళ్లీ పెరుగుతున్నాయి. కేసీఆర్ హయాంలో సిజేరియన్లు 50 శాతమే ఉండగా, ఇప్పుడు అవి 80 శాతానికి పెరిగాయి. కాంగ్రెస్ పాలనలో మళ్లీ ఉమ్మడి రాష్ట్రం నాటి రోజులు గుర్తుకొస్తున్నాయి.
ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ దవాఖానల్లో కేవలం 30% ప్రసవాలు జరిగితే, ప్రత్యేక రాష్ట్రంలో కేసీఆర్ హయాంలో అదే ప్రభుత్వ దవాఖానల్లో 70% ప్రసవాలు జరిగాయి. మళ్లీ కాంగ్రెస్ పాలనలో కథ మొదటికొచ్చినట్టయింది. కేసీఆర్ పాలనలో ప్రభుత్వ దవాఖానల్లో సకల సౌకర్యాలు కల్పించడం, వైద్యులు, సిబ్బందిని నియమించడంతో సత్ఫలితాలు సాధ్యమయ్యాయి. ఈ రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో ముందుచూపు లేక, సర్కారు దవాఖానల నిర్వహణలో నిర్లక్ష్యంతో సిజేరియన్ల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. ఈ గణాంకాలను ఎయిమ్స్ (ఢిల్లీ), పాపులేషన్ కౌన్సిల్ (2025) దక్షిణాది రాష్ర్టాల్లో నిర్వహించిన అధ్యయనమే తేల్చి చెప్పింది. దక్షిణాదిలో సీ సెక్షన్ల రేట్లో తెలంగాణ టాప్‌లో ఉన్నట్టు ఇటీవల ఆ అధ్యయనంలో తేలడం గమనార్హం. ప్రస్తుతం జిల్లాల్లో 80% ప్రసవాలు సిజేరియన్ల ద్వారా జరుగుతుండగా, జంట నగరాల్లో 45 శాతంగా ఉన్నది. రాష్ట్రవ్యాప్తంగా 60 శాతానికి పైగా ప్రసవాలు శస్త్రచికిత్సల ద్వారా జరుగుతున్నాయని ఈ అధ్యయనం తేల్చి చెప్పింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం శస్త్రచికిత్స ద్వారా ప్రసవాలు 10 నుంచి 15 శాతానికి మించకూడదు. కానీ, ప్రస్తుతం రాష్ట్రంలో సాధారణ ప్రసవాల కన్నా, సిజేరియన్లు ఎక్కువగా కావడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నది. రాష్ట్రంలో ఏటా మొత్తం ప్రసవాలు సుమారు 6.55 లక్షలు జరుగుతుండగా.. రాష్ట్ర వ్యాప్తంగా సీ-సెక్షన్లు 60శాతానికి పైగా అవుతున్నట్టు రిపోర్టు తెలిపింది. సిబ్బంది కొరత, మౌలిక వసతుల కల్పనలో సవాళ్లు వైద్యారోగ్యంలో ప్రధాన సమస్యలుగా ఉన్నట్టు తెలిపింది. సిజేరియన్లతో తల్లీశిశువుల ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందని, ఇన్ఫెక్షన్లతో పాటు శిశువుల్లో శ్వాసకోశ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుందని హెచ్చరించింది. ప్రైవేటు దవాఖానల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉన్నట్టు ఆ నివేదిక ఆందోళన వ్యక్తంచేసింది. ప్రైవేటు దవాఖానల్లో ఏకంగా 81.5% సిజేరియన్లే అని వెల్లడించింది. స్థానిక వైద్యాధికారులు హెచ్చరిస్తున్నా.. ప్రైవేటు దవాఖానలు తమ తీరు మార్చుకోకుండా డబ్బు ఆశతో శస్త్ర చికిత్సలతోనే ప్రసవాలు చేస్తున్నట్టు వివరించింది. ఎలాంటి మెడికల్ ఎమర్జెన్సీ లేకున్నా.. వైద్యుల సౌలభ్యం కోసం నాన్ క్లినికల్ కారణాలతో సిజేరియన్లు చేస్తున్నట్టు తెలిపింది. మరో వైపు గర్భిణులకు పురిటి నొప్పులపై అవగాహన లేకపోవడం పరిస్థితికి కారణమని స్పష్టం చేసింది. గతంలో కాగ్ రిపోర్టు సైతం రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనలో ఉన్న అసమానతలను ఎత్తిచూపడం గమనార్హం. ఈ పరిణామాలన్నీ ప్రజారోగ్యానికి సవాల్‌గా మారినట్టు ఆ నివేదిక ఆందోళన వ్యక్తంచేసింది.
ప్రజారోగ్యంపై కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రంలో వైద్యారోగ్య శాఖ సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నది. తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ)లో ఏకంగా వైద్యులకే జీతాలు ఇవ్వలేని దుస్థితి ఉందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మరోవైపు కేసీఆర్ నాడు ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలను పెంచడమే లక్ష్యంగా ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన కేసీఆర్ కిట్, మగబిడ్డ పుడితే రూ.12 వేలు, ఆడబిడ్డ పుడితే రూ.13 వేలు ఆర్థికసాయం, గర్భిణులకు పౌష్టికాహారం అందించే న్యూట్రిషన్ కిట్ పథకాలను కేవలం కేసీఆర్‌కు పేరొస్తుందనే కుట్రతోనే కాంగ్రెస్ సర్కారు నిలిపివేసింది. ప్రభుత్వ దవాఖానలకు వచ్చే గర్భిణులకు వైద్య సదుపాయమే కాకుండా ఆర్థికంగా ప్రోత్సహిస్తే ప్రసవాల సంఖ్య పెంచవచ్చనే దృఢ సంకల్పంతో నాడు కేసీఆర్ ఆయా పథకాలను ప్రవేశపెట్టారు. మరోవైపు గర్భిణుల ఆరోగ్య రక్షణకు రేవంత్ సర్కారు ఎలాంటి పథకాలను ప్రారంభించకపోగా, ఉన్న పథకాలకు కోతపెట్టడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.