ఆ యువకుడి పేరు రమావత్ శంకర్‌నాయక్. తండ్రి లేని అతడు.. అన్నీ తానై పెంచిన తల్లి కష్టార్జితంతో ఎంఏ వరకూ చదివాడు. పోలీస్ శాఖలో ఎస్సై కావాలని కలలుగన్నాడు. హైదరాబాద్‌లో ఉంటూ గత ఐదేండ్లుగా తన కలను నెరవేర్చుకొనేందుకు సన్నద్ధం అవుతున్నాడు. ‘తానొకటి తలిస్తే.. దైవం మరొకటి తలంచే’ అన్నట్టుగా అతని ఆశలపై కాంగ్రెస్ సర్కార్ నీళ్లు కుమ్మరించింది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మూడేండ్లు కావస్తున్నా.. ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా నాన్చుతూ వస్తున్నది. విసిగి వేసారిన శంకర్‌నాయక్.. సర్కార్‌పై ఆశలు వదులుకొన్నాడు. అటు ఇంటికి వెళ్లలేక, ఇక్కడ మరోదారి లేక ‘ఆస్పిరెంట్స్ అడ్డా’ అన్న పేరుతో టీ షాప్ పెట్టుకొని ఉపాధిని ఎంచుకొన్నాడు. ఇది ఒక్క శంకర్‌నాయక్ ఉదంతమే కాదు.. ఇలాంటి శంకర్‌నాయక్‌లు తెలంగాణలో ఊరూరా కాంగ్రెస్ సర్కార్ నయవంచనకు గురైన వారున్నారు.
ఎల్బీనగర్, మార్చి 31: సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మంచాతండాకు చెందిన రమావత్ శంకర్‌నాయక్ సూర్యాపేటలో ప్రాథమిక విద్య పూర్తిచేశాడు. శంకర్‌నాయక్ తండ్రి బాలు 2022లో చనిపోగా, తల్లి తరంగిణి కొడుకును సాకుతూ వచ్చింది. శంకర్‌నాయ పాలిటెక్నిక్ ఎంట్రెన్స్‌లో రాష్ట్రస్థాయిలో ఆరో ర్యాంక్ సాధించి గజ్వేల్‌లోని ప్రభుత్వ మాడల్ రెసిడెన్షియల్ కాలేజీలో పాలిటెక్నిక్ కోర్సు పూర్తిచేసిన అనంతరం ఎంఏ పొలిటికల్ సైన్స్‌లో పీజీ పూర్తిచేశాడు. రమావత్ శంకర్ నాయక్‌కు ప్రస్తుతం 31 ఏండ్లు. చిన్ననాటి నుంచే ఎస్సై కావాలని కలలు కంటూ చదువులో రాణిస్తూ వచ్చాడు. లక్ష్యాన్ని చేరుకోవడానికి పట్టుదలతో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వచ్చాడు. ఐదేండ్లుగా ఎస్సై ఉద్యోగం కోసం అన్ని రకాలు సిద్ధమవుతూ రాసాగాడు. గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు ఆశలు చూపింది. నోటిఫికేషన్లు వేసి ఉద్యోగాలను భర్తీ చేస్తామని నమ్మబలికింది. అందరు నిరుద్యోగులు నమ్మినట్టుగానే శంకర్‌నాయక్ కూడా ఆనాడు కాంగ్రెస్ మాటలు నమ్మాడు. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు కావస్తున్నా.. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా పబ్బం గడుపుతున్నది. ఈ దశలో తాను అనుకున్న ఉద్యోగ నోటిఫికేషన్ రాకపోవడంతో శంకర్‌నాయక్ ఉక్కిరిబిక్కిరి అయ్యాడు.
ఎలాగైనా తన కొడుకు అనుకున్న ఉద్యోగం సాధించి కుటుంబాన్ని పోషిస్తాడని, తన కష్టాలు తీరుతాయని అతని తల్లి తరంగిణి ఆశపడింది. ప్రభుత్వ ఉద్యోగం ఎంతకూ రాకపోవడంతో రోజురోజుకూ వారి కుటుంబ జీవనం కష్టంగా మారింది. ఈ దశలో ఉన్నత విద్యాభ్యాసం చేసినా ఉద్యోగం రాలేదని ఆ యువకుడు మదనపడుతూ వచ్చాడు. ఊరికి వెళ్లి బతుకుదామంటే సూటిపోటి మాటలతో వేధిస్తారని భయపడ్డాడు. ఇక్కడ ఉంటే మరో ఉపాధి కరువైంది. తన చదువుతోపాటు ఉండేందుకు జీవనం కూడా కష్టమైంది. ఒకవైపు తన కలలను చంపుకోలేక, మరోవైపు బతుకు దెరువు లేక సతమతం అయ్యాడు. ఈ దశలోనే సర్కార్ వంచనకు గురైన ఆ యువకుడు టీ షాప్ పెట్టుకొన్నాడు. నలుగురికి టీలు అమ్ముతూ ఉపాధి పొందుతున్నాడు.
పోలీస్ శాఖలో సబ్ ఇన్స్పెక్టర్ అవుదామని ఆశతో హైదరాబాద్ వచ్చి ఎదురుచూస్తున్న ఆ యువకుడు బతుకుదెరువు కోసం ‘ఆస్పిరెంట్స్ అడ్డా’ అన్న పేరుతో టీకొట్టు పెట్టుకొన్నాడు. ఇక్కడ కూడా తన కలను సందేశంగా పదుగురికి తెలియాలనే సంకల్పం పెట్టుకొన్నాడు. అందుకే ఆ షాప్‌పై ‘లక్ష్యంపై ఫోకస్ పెట్టు.. అనుకున్నది సాధించు! (ఫోకస్ ఆన్ యువర్ ఎయిమ్ అండ్ బ్లర్ ఎవ్రీతింగ్) అంటూ ట్యాగ్‌లైన్ పెట్టాడు. హైదరాబాద్ దిల్సుఖ్నగర్ సమీపంలోని చైతన్యపురిలో నాలుగు రోజుల క్రితమే శంకర్‌నాయక్ దానిని ప్రారంభించాడు. ఉద్యోగం చేసి కుటుంబానికి ఆసరా అవుదామనుకొంటే.. ఇప్పుడు కుటుంబానికే భారంగా మారానని బాధపడ్డాడు. ప్రభుత్వం నోటిఫికేషన్లు వేయకుండా ఏండ్లుగా దాటవేస్తుండటంతో తన కాళ్లపై తాను నిలబడాలని ఈ ఉపాధి బాటపట్టాడు. జాబ్ నోటిఫికేషన్ పడితే సిద్ధపడుతానని ఆశతోనే ఉన్నాడీ యువకుడు. ఎన్నికల ముందు నిరుద్యోగులను ఆశలపల్లకి చూపిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి వచ్చాక ఉద్యోగాలు భర్తీ చేయకుండా వారిపై నిర్లక్ష్యం చూపుతున్నది. ఇలాంటి స్థితిలో నిండా మునిగిపోతున్న యువత తమ ఉద్యోగవేటతోపాటు తమ జీవనోపాధి కోసం ఉన్నత చదువును సైతం పక్కనబెట్టి ఇలా చిరు వ్యాపారాలకు శ్రీకారం చుడుతున్నారు. కాంగ్రెస్ సర్కార్ నిరుద్యోగ వ్యతిరేక విధానాల కారణంగా ఇలాంటి శంకర్‌నాయక్‌లు ఊరూరా ఉన్నారు.
ప్రభుత్వం నోటిఫికేషన్ వేస్తే జాబ్ గ్యారెంటీగా కొడుతా. ఎస్సై ఉద్యోగం కోసం ఏండ్లుగా సిద్ధమయ్యా. నేను మంచి ఉద్యోగంలో ఉండాలని నా కుటుంబసభ్యులు, స్నేహితులు కోరుకుంటున్నారు. మా నాన్న లేరు. మా అమ్మ బాధ్యత చూసుకోవాలి. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఎన్నికల ముందు చెప్పిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు కావస్తున్నా ఎలాంటి నోటిఫికేషన్లు ఇవ్వకుండా నాలాంటి నిరుద్యోగులను నిండా ముంచుతున్నది. బతుకుదెరువు కోసం తప్పని పరిస్థితిలో నేను చాయ్ షాప్ పెట్టుకున్న.