నవాబుపేట, నవంబర్ 9 : రీజినల్ రింగ్ రోడ్డుకు తాము ఎట్టి పరిస్థితుల్లోనూ భూములు ఇవ్వబోమని వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలం పులుమామిడి, మాదిరెడ్డిపల్లి గ్రామాల రైతులు స్పష్టం చేశారు. ఎలాంటి సమాచారం లేకుండా శనివారం తమ భూముల్లో ఆర్బీ అసోసియేషన్ ఏజెన్సీ కంపెనీ సిబ్బంది చేస్తున్న లైడార్ సర్వేను రైతులు అడ్డుకున్నారు. జీవనాధారమైన భూములను తీసుకుంటే తామెలా బతకాలని మండిపడ్డారు. కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్లను కలిసి తమ భూములను ప్రభుత్వం రీజినల్ రింగ్ రోడ్డు కోసం తీసుకుంటున్నదని చెబితే.. తమకు ప్రభుత్వం ఎలాంటి సమాచారం లేదని వారు పేర్కొంటున్నారని రైతులు తెలిపారు. ‘జిల్లా స్థాయి అధికారులకే సమాచారం లేనప్పుడు.. మా భూముల్లోకి వచ్చి ఎందుకు సర్వే చేస్తున్నారు? మిమ్మల్ని ఎవరు పంపించారు? ట్రిపుల్ ఆర్ సర్వే అంటున్నారు? రింగ్ రైల్ సర్వే అంటున్నారు. ఇంతకు మీరు చేస్తున్న సర్వే ఏమిటి?’ అని ప్రశ్నించారు.
మాకు ఈ భూమే ఆధారం
మాకు ఈ భూమే ఆధారం. దానిని నమ్ముకునే బతుకున్నాం. మా భూములను ప్రభుత్వం తీసుకుంటే మేము ఎలా బతకాలి? నాకు నాలుగు ఎకరాలు ఉన్నది. దానిని తీసుకుంటే.. దానికి బదులుగా మరో చోట భూమిని ఇచ్చి న్యాయం చేయాలి. రింగ్ రైల్ పట్టా భూముల్లోంచి కాకుండా ప్రభుత్వ, అసైన్డ్ భూముల్లోంచి వెళ్తే అందరికీ బాగుంటుంది.
-నారాయణ, పులుమామిడి గ్రామం
ఉన్నదే మూడు ఎకరాలు
మా కుటుంబానికి మూడు ఎకరాల భూమే ఆధారం. దానిని రోడ్డు కోసం తీసుకుంటే మేము ఎలా బతకాలి? అధికారులు వచ్చి మా భూముల్లో తిరుగుతుంటే గుండెలు పగులుతున్నాయి. రియల్ వ్యాపారులు, రాజకీయ నేతల భూముల్లోంచి కాకుండా రైతుల భూముల్లోంచే రింగ్ రైల్‌ను ఏర్పాటు చేయాలనుకోవడం భావ్యం కాదు.
-బుచ్చిరెడ్డి, పులుమామిడి గ్రామం