హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తేతెలంగాణ): పాలనలో పారదర్శకత కోసం 2005 లో కేంద్రం తెచ్చిన సమాచార హక్కు చట్టం తెలంగాణలో నిర్వీర్యమవుతున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పది నెలలు దాటినా సమాచార హక్కు చట్టం అమలు, ప్రధాన క మిషనర్, కమిషనర్ల నియామకాలను పట్టించుకోవడంలేదు. నోటిఫికేషన్ ఇచ్చి దరఖాస్తు లు స్వీకరించి రెండు నెలలు దాటినా అడుగు ముందుకు పడడంలేదు. అప్పీళ్లు పేరుకుపోగా ప్రజలు ఆర్టీఐ ఆఫీస్ చుట్టూ తిరిగి వేసారిపోతున్నారు. అధికారంలోకి రాగానే ప్రధాన క మిషనర్, కమిషనర్లను నియమిస్తామంటూ ఎన్నికల సమయంలో రేవంత్‌రెడ్డి ఆర్భాటం గా ప్రకటించారు. ప్రధాన కమిషనర్ పదవీ కాలం 2020 ఆగస్టు 24న, కమిషనర్ల పదవీకాలం 2023 ఫిబ్రవరి 24న ముగిసింది. ప్రధాన కమిషనర్, కమిషనర్లు లేక 10 వేలకుపైగా అప్పీళ్లు పెండింగ్‌లో పడ్డాయి.
ఆర్టీఐ ప్రధాన కమిషనర్, కమిషనర్ల ని యామకానికి జూన్ 12న నోటిఫికేషన్ ఇచ్చిం ది. 400కు పైగా దరఖాస్తులు వచ్చాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2023 జూలైలో ఆర్టీఐ కమిషనర్ల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేయగా 350 దరఖాస్తులు వచ్చాయి. అంటే ఏడు పోస్టుల కోసం 750 మంది పోటీపడు తుండగా, 1:3 చొప్పున షార్ట్‌లిస్ట్ తయారీకి చీఫ్ సెక్రటరీ చైర్‌పర్సన్‌గా ముగ్గురు అధికారులతో కమిటీ ఏర్పాటైంది. కమిటీ వేసి రెండు నెలలు దాటినా స్క్రూటినీ కూడా చేపట్టలేదు.
సెక్షన్ 15(1)కింద తెలంగాణలో 2017 లో సమాచార కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఇందు లో ప్రధాన కమిషనర్‌తోపాటు 10 మంది సభ్యులను నియమించే అవకాశం ఉం టుంది. వీరిని ముఖ్యమంత్రి నేతృత్యంలోని హైలెవల్ కమిటీ ఎంపిక చేస్తుంది. ఇందులో డిప్యూటీ సీఎం, ప్రతిపక్ష నేత సభ్యులుగా ఉ న్నారు. ఈ కమిటీ సుప్రీం మార్గదర్శకాల మే రకు ప్రధాన కమిషనర్, కమిషనర్లను సెలెక్ట్ చేస్తుంది. ప్రజాసేవలో నిమగ్నమైన వారు, విస్తృత విషయ పరిజ్ఞానం ఉన్నవారు, పాలనాదక్షత, జర్నలిజం, ప్రసార మాధ్యమాల రంగాల్లో విశేష సేవలందించిన వారిని ఎంపి క చేయాల్సి ఉంటుంది.
కాంగ్రెస్ సర్కారు ఆది నుంచీ పాలనకంటే రాజకీయాలపైనే ఫోకస్ పెట్టింది. వివిధ కార్పొరేషన్ల చైర్మన్ల నియామకంలోనూ రాజకీయ నేతలకే పెద్దపీట వేసింది. ఇటీవల ప్రధాన ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన పీఏసీ చైర్మన్‌ను బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి చేరిన ఎమ్మెల్యేకే కట్టబెట్టింది. ఇదే కోవలో సమాచార ప్రధాన కమిషనర్, ఆరుగురు కమిషనర్లను సైతం పొలిటికల్ నేపథ్యమున్నవారికే ఇస్తారా? అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.