అగ్ర హీరో నాగచైతన్య రాబోతున్న సినిమా ‘వృషకర్మ’. మైథలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘విరూపాక్ష’ఫేం కార్తీక్ దండు దర్శకుడు. సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి ఎస్వీసీసీ అధినేత బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిర్మాణంలో ఉన్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ప్రచారంలో భాగం గా విడుదల చేసిన ప్రచార చిత్రాలకు అద్భుతమైన స్పందన వస్తున్నదని చిత్రబృందం ఆనందం వ్యక్తం చేస్తోంది.
ఈ క్రమంలో గురువారం హీరో నాగచైతన్యకు సంబంధించిన రెండు స్టిల్స్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఇందులో పాత్ర కోసం కఠినమైన వ్యాయామం చేస్తూ దృఢకాయుడిగా కనిపిస్తున్న స్టిల్ ఒకటైతే.. గాయాలతో, యుద్ధానికి సిద్ధమైన యోధుడిగా కనిపిస్తున్న స్టిల్ మరొకటి. ఈ సినిమాలో చైతూ పోషిస్తున్న పాత్ర పేరు అర్జున్. ఆ పాత్ర స్వభావాన్ని సహజంగా ఆవిష్కరించేందుకు నాగచైతన్య చూపిస్తున్న అంకితభావానికి నిదర్శనం ఈ స్టిల్స్ అని మేకర్స్ చెబుతున్నారు.
మైథలాజికల్, యాక్షన్ అంశాల మేలుకలయికగా ఈ సినిమా రూపొందుతున్నదని, తెలుగు రాష్ర్టాలు, కర్ణాటక ప్రాంతాల థియేట్రికల్ హక్కులను సుమారు 45కోట్లకు సితార సంస్థ సొంతం చేసుకున్నదని మేకర్స్ తెలిపారు. మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో స్పర్శ్ శ్రీవాస్తవ, జయరామ్ కీలక పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: రాగుల్ డి.హెరియన్, సంగీతం: అజనీష్ బి.లోక్‌నాథ్, సమర్పణ: బాపినీడు.