‘యాక్షన్ కలబోసిన ప్రేమకథా చిత్రమిది. ఈ మధ్యకాలంలో లవ్‌స్టోరీస్ తగ్గిపోయాయి. కథకు అవసరం ఉందనుకుంటే నేను ఏదైనా చేస్తాను. ఓ కొత్త జోనర్లో చేసిన ప్రయోగాత్మక చిత్రంగా అందరిని అలరిస్తుంది’ అన్నారు అడివి శేష్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘డెకాయిట్’ ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకురానుంది. షానియల్ డియో దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సుప్రియా యార్లగడ్డ నిర్మిస్తున్నారు. మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తున్నది.
ఇటీవలే షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా బుధవారం షూట్ర్యాప్ పేరుతో నిర్వహించిన ప్రెస్మీట్లో అడివి శేష్ మాట్లాడుతూ.. విడిపోయిన మాజీ ప్రేమికులు వారి ప్రయాణంలో ఏ సత్యాన్ని తెలుసుకున్నారన్నది ఈ సినిమాలో ఆసక్తికరమైన అంశమని, కథలో రాబరీ ఓ భాగంగా ఉంటుందని, అందుకే ‘డెకాయిట్’ అనే టైటిల్ పెట్టామన్నారు. ఇలాంటి బ్యూటిఫుల్ లవ్‌స్టోరీలో భాగం కావడం ఆనందంగా ఉందని అనురాగ్‌కశ్యప్ అన్నారు. ఇదొక లాంగ్‌జర్నీ అని, అందరికి కనెక్ట్ అయ్యే హార్ట్‌టచింగ్ లవ్‌స్టోరీగా మెప్పిస్తుందని నిర్మాత సుప్రియ యార్లగడ్డ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.