హైదరాబాద్, మార్చి 24 ( నమస్తే తెలంగాణ) : పౌరసరఫరాలశాఖలో చేపట్టిన సంసరణలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని ఆ శాఖ ముఖ్య కార్యదర్శి డీఎస్ చౌహాన్ అన్నారు. ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయడంతోపాటు 48 గంటల్లోనే చెల్లింపులు చేసేలా చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా, సీఎమ్మార్ ఎగవేతలపై కఠిన చర్యలు తీసుకున్నామని, ఏడాది కాలంలో రూ.409 కోట్ల విలువైన అక్రమ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. సోమవారం ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయపూర్‌లోని ఐఐఎంలో నిర్వహించిన అంతర్జాతీయ కార్యక్రమంలో చౌహాన్ మాట్లాడు తూ.. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని అక్రమాలకు అడ్డుకట్ట వేశామని, వందశాతం రూట్ ఆప్టిమైజేషన్ మైలురాయిని సాధించి తెలంగాణ దేశంలో మొదటి రాష్ట్రంగా నిలిచిందని, ఫలితంగా ప్రభుత్వానికి ఏడాదికి రూ.12 నుంచి 15 కోట్లు ఆదా అవుతున్నాయని వెల్లడించారు. పేదలకు నాణ్యమైన బియ్యం పంపిణీలో భాగంగా ఏప్రిల్ నుంచి సన్న బియ్యం పంపిణీ చేయబోతున్నట్టు పేర్కొన్నారు.