హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): వానాకాలం సీజన్లో 10లక్షల ఎకరాలకు వరి విత్తనాలతోపాటు, కంది, పెసర, మినుము విత్తనాలకు లోటులేకుండా ప్రణాళికలు రూపొందించాలని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం విత్తనాభివృద్ధి సంస్థ ప్రధాన కార్యాలయంలో విత్తన సేకరణ, సరఫరాపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వానాకాలంలో సంస్థ ఆధ్వర్యంలో 1.50లక్షల ఎకరాలకు మాత్రమే వరి విత్తనాలు అందించిందని.. ఈ సీజన్లో 10లక్షల ఎకరాలకు విత్తనాలు అందించే విధంగా ప్రణాళికా రూపొందించాలని ఆదేశించారు. అలాగే కంది, పెసర, మినుము విత్తనాలు కూడా ఎలాంటి లోటులేకుండా ఇవ్వాలని కోరారు. రైతులకు అవగాహన కల్పిస్తూ, నాణ్యమైన విత్తనాలు వినియోగించి.. అధిక దిగుబడులు సాధించేలా సహకారం అందించాలని సూచించారు. ఈ సమావేశంలో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ షేక్ యాస్మిన్ బాషా, సంస్థ ప్రాంతీయ మేనేజర్లు, ఆపరేషన్ హెడ్లు తదితరులు హాజరయ్యారు.