హైదరాబాద్, ఫిబ్రవరి 24 : రాష్ట్రంలో వరిసాగు భారీగా తగ్గింది. గత యాసంగితో పోల్చితే ప్రస్తుతం 35 శాతం వరకు వరి సాగు తగ్గడం గమనార్హం. గత యాసంగిలో 52.78 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా, ప్రస్తుతం 34.21 లక్షల ఎకరాల్లో మాత్రమే వేశారు. గతేడాది యాసంగితో పోల్చితే 18.57 లక్షల ఎకరాల్లో వరి సాగు తగ్గింది. యాసంగి వడ్లు కొనబోమని కేంద్రప్రభుత్వం చేతులెత్తేయటంతో వరి సాగు చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వం రైతులను కోరింది. దీనిపై క్షేత్రస్థాయి వరకు విస్తృతంగా ప్రచారం చేసింది. దీంతో మెజార్టీ రైతులు వరి సాగుకు దూరంగా ఉన్నారు. మిల్లర్లు, విత్తన కంపెనీలతో ఒప్పందం ఉన్నవారు, ఇంటి అవసరాల కోసం మాత్రమే వరిని సాగు చేశారు.
రైతుల పొట్ట కొట్టిన కేంద్రం
రాష్ట్రంలో వరి సాగు తగ్గడానికి కేంద్రంలోని బీజేపీ సర్కారు నిర్ణయాలే ప్రధాన కారణం. కేంద్రం తన అసంబద్ధ, అనాలోచిత నిర్ణయాలతో తమ పొట్ట కొట్టిందని రైతులు మండిపడుతున్నారు. ఇకపై యాసంగిలో ఉప్పుడు బియ్యం (బాయిల్డ్ రైస్) కొనబోమని కేంద్రం చేతులెత్తేసింది. రాష్ట్రప్రభుత్వం ఎన్నిరకాలుగా విజ్ఞప్తి చేసినా ససేమిరా అన్నది. తెలంగాణలో యాసంగిలో పండేదే బాయిల్డ్ రైస్ కాబట్టి.. పరోక్షంగా యాసంగిలో ధాన్యం కొనుగోలు చేయబోమని కేంద్రం చెప్పేసింది. దీంతో రైతులు నష్టపోవద్దనే ఉద్దేశంతో వరి సాగు చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సూచించింది. ఇతర పంటల సాగు చేపట్టేలా ఏర్పాట్లు కూడా చేసింది. కేంద్రం నిర్ణయ ప్రభావం రాష్ట్రంలో వరి సాగు విస్తీర్ణంపై పడింది. గత యాసంగిలో మొత్తం 68.14 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. ఈ సీజన్లో ఇప్పటివరకు 50.46 లక్షల ఎకరాల్లోనే పంటలు వేశారు. గత సీజన్‌తో పోల్చితే సాగు విస్తీర్ణం ఏకంగా 18 లక్షల ఎకరాలు తగ్గింది. కాళేశ్వరం జలాలతో రాష్ట్ర వ్యాప్తంగా చెరువులు, బావులు నిండు కుండల్లా మారినా వరి వేయలేని పరిస్థితి ఉన్నదని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
పెరిగిన ఇతర పంటల సాగు
వరి సాగు తగ్గినప్పటికీ రైతులు ఇతర పంటలను జోరుగా సాగు చేశారు. పప్పు, నూనె గింజల పంటల సాగుపై ప్రధానంగా దృష్టి పెట్టారు. నూనె గింజల పంటల సాగు గత సీజన్‌తో పోల్చితే లక్ష ఎకరాలు పెరుగగా, పప్పు దినుసుల సాగు సుమారు 60 వేల ఎకరాల వరకు పెరిగింది. వేరుశనగ గత సీజన్లో 2.59 లక్షల ఎకరాల్లో సాగుచేయగా, ఈ సీజన్లో 3.41 లక్షల ఎకరాలకు పెరిగింది. పొద్దుతిరుగుడు గత సీజన్లో 17 వేల ఎకరాల్లో వేయగా, ఇప్పుడు 36 వేల ఎకరాలకు పెరిగింది. శనగ, మినుము పంట 20 వేల ఎకరాల వరకు పెరిగింది.