దేవరుప్పుల, ఫిబ్రవరి 14 : ప్రజా ప్రభుత్వమని చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వం జర్నలిస్టుల గొంతునొక్కి, వారిపై ఉక్కుపాదం మోపాలని చూడటం ప్రజా పాలన అవుతుందా? అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రశ్నించారు. హైదరాబాద్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆర్జీ టీవీ జర్నలిస్ట్ రాజ్‌కుమార్‌ను అక్రమంగా అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తరలించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. రాజ్‌కుమార్ అరెస్ట్ విషయం తెలిసిన ఎర్రబెల్లి నేరుగా హైదరాబాద్‌లోని సైబర్ క్రైమ్ ఆఫీసుకు వెళ్లి డీసీపీతోపాటు, సంబంధిత అధికారులతో మాట్లాడారు. రాజ్‌కుమార్‌కు ధైర్యం చెప్పిన ఆయన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ఆర్జీ టీవీ జర్నలిస్ట్ రాజ్‌కుమార్‌పై గతంలో అక్రమ కేసులు పెట్టి 14 రోజులు జైలుపాలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, అతడిపై మరోమారు ఉక్కుపాదం మోపాలని చూస్తున్నదని మండిపడ్డారు. ప్రజాసమస్యలను ప్రభుత్వానికి తెలపడం, హామీలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వ్యక్తుల గొంతులను యూట్యూబ్ ద్వారా ప్రచారం చేయడం ప్రజాస్వామ్యంలో జర్నలిస్టుల హక్కు అని, దాన్ని కాలరాయాలని చూస్తున్న ఈ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. కేటీఆర్ కొడంగల్ ప్రచారంలో భాగంగా అక్కడి ప్రజల ఆవేదనను తన యూట్యూబ్ చానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లడం అతను చేసిన తప్పా అని ప్రశ్నించారు. రాజ్‌కుమార్‌పై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలని, అతడిని వదిలిపెట్టాలని డిమాండ్ చేశారు. మరోవైపు రాజ్‌కుమార్‌కు బెయిల్ మంజూరైంది.