హైదరాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ ) : జార్ఖండ్ రాష్ట్రం రాంచీ పట్టణంలో ఈనెల 10 నుంచి 15వరకు జరిగిన 68వ అఖిల భారత పోలీస్ డ్యూటీ మీట్లో విజేతలుగా నిలిచిన పోలీసులకు డీజీపీ జితేందర్ గురువారం రివార్డులు అందజేశారు. తెలంగాణ పోలీస్ సిబ్బంది అత్యున్నత నైపుణ్యం, క్రమశిక్షణ తోపాటు మొత్తం 18 పతకాలు గెలుచుకొని రాష్ట్ర ఖ్యాతిని పెంచారని కొనియాడారు. పోలీస్ డ్యూటీ మీట్ నోడల్ ఆఫీసర్ శిఖాగోయల్, స్పోర్ట్స్ ఐజీ ఎం.రమేష్, టీం మేనేజర్ సీఐడీ ఎస్పీ బీ రాంరెడ్డి, కోచ్‌లు ఐఎస్‌డబ్ల్యూ ఎస్పీ ఎం.రామకృష్ణ, జెనో అడిషనల్ ఎస్పీ డీ ప్రతాప్, సచివాలయ భద్రత ఏసీపీ పూర్ణచందర్ తదితరులు రివార్డులు స్వీకరించిన వారిలో ఉన్నారు.
బల్మూరు, ఫిబ్రవరి 20 : గ్రామ శివారులో జరుగుతున్న మైనింగ్ పనులను వెంటనే నిలిపివేయాలని మైలారం వాసులు డిమాండ్ చేశారు. తవ్వకాల అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి 500 పోస్టుకార్డులను రాసి పోస్టు చేశారు. గుట్టకు సమీపంలోనే ఊరు ఉండడంతో ఆలయాలు, ఇండ్లు దెబ్బతింటున్నాయని, సాగు నష్టాల బాట పట్టిందని పలువురు వాపోయారు. పర్యావరణానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.