హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్‌లో అంటుకున్న అసంతృప్తి సెగలు అగ్ని కీలలుగా మారాయా? ఫిబ్రవరిలో ప్రత్యేకంగా, రహస్యంగా సమావేశమై వేరుకుంపటి మొదలుపెట్టిన 10 మంది హస్తం పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పుడు ప్రభుత్వానికి ప్రతిబంధకంగా మారారా? వారు పక్కాగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి, సమయం చూసి విమర్శలు చేస్తున్నారా? అసంతృప్త గ్రూప్‌లో మహబూబ్‌నగర్ ఎమ్మెల్యేలే ఎక్కువగా ఉన్నారా? సొంతా జిల్లా ఎమ్మెల్యేలనే సీఎం రేవంత్‌రెడ్డి నియంత్రణలో పెట్టుకోలేకపోయారా? నల్లగొండకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే కనుసన్నల్లోనే వీళ్లు నడుస్తున్నారా? వీళ్లు ఇచ్చిన ధీమాతోనే ‘మూడు నెలల్లో రేవంత్ ప్రభుత్వం కూలిపోతుంది’ అని మాజీ ఎమ్మెల్సీ ప్రకటన చేశారా? ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలను చూసినవాళ్లు ‘అవును’ అనే సమాధానం ఇస్తున్నారు.
ఒకరి తర్వాత ఒకరు బయటికి వస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను, సీఎంగా రేవంత్‌రెడ్డి సామర్థ్యాన్ని సవాల్ చేస్తున్నట్టుగా వ్యాఖ్యలు చేస్తుండటం చూసి రాజకీయ విశ్లేషకులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఐదుగురు ఎమ్మెల్యేలు ఒకరి తర్వాత ఒకరు అంశాల వారీగా చేస్తున్న విమర్శలు ప్రభుత్వాన్ని గుక్క తిప్పుకోకుండా చేస్తున్నాయని కాంగ్రెస్ వర్గాలు ఆందోళనతో ఉన్నాయి.
ఫిబ్రవరిలో గుంపు కట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇప్పుడు రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి పెను సవాల్‌గా మారినట్టు కాంగ్రెస్‌లో చర్చ జరుగుతున్నది. అప్పట్లో వారు ఒక హోటల్లో రహస్యంగా సమావేశమై ఎమ్మెల్యేల కాంట్రాక్టు పెండింగ్ బిల్లులకు మంత్రులు కమీషన్లు, రెవెన్యూ పనుల్లో వాటాలు అడుగుతున్నారని రగిలిపోయారు. బయటికి ముగ్గురు మాత్రమే కనిపిస్తున్నా వీళ్లది మొత్తం పది మంది ఎమ్మెల్యేల గుంపు అని కాంగ్రెస్‌లోనే ప్రచారం జరుగుతున్నది. ఇటీవల రాష్ట్రానికి చెందిన పోలీసు అధికారి మీద అసెంబ్లీలో ప్రివిలేజ్ మోషన్‌కు ప్రయత్నం చేసినప్పుడు సీఎంకు వీళ్ల బలం ఏమిటో తెలిసిందని చర్చ నడుస్తున్నది. తాజాగా సొంత ప్రభుత్వంపై వారు చేస్తున్న విమర్శలు రాజకీయాల్లో ఆసక్తిగా మారాయి.
గతంలో పదేండ్లు సీఎంగా ఉంటానని రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్‌ను బహిరంగంగానే తప్పుపట్టిన సీనియర్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, క్రమ క్రమంగా తన స్వరం పెంచుతూ వస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఒకోసారి ఒకో అంశాన్ని లేవనెత్తుతూ రేవంత్ ప్రభుత్వం మీద ఒక రకమైన దాడి చేస్తున్నారు. ట్రిపుల్ఆర్ ప్రాజెక్ట్ బాధిత రైతులతో మాట్లాడుతూ ‘అలైన్మెంట్ మారాలంటే ప్రభుత్వమే మారాలేమో’ అంటూ పేల్చిన బాంబు ప్రభుత్వంలో విస్ఫోటనం కలిగించింది. అనంతరం కొద్దిరోజులకే ‘యువతను ఉద్యోగాల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తున్నది’ అని విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన రూ.2 లక్షల ఉద్యోగాల హామీని నిలబెట్టుకోలేదని, నేపాల్ తరహాలో యువత తిరగబడి మన ప్రభుత్వాన్ని కూల్చుతుందని వ్యాఖ్యానించటంతో ప్రభుత్వం ఇబ్బందుల్లో పడ్డది.
రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల కాక ఆరకముందే ఆయన సన్నిహితుడు మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ బాంబు పేల్చారు. మరో మూడు నెలల్లో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కూలిపోతుందని హెచ్చరించడం కాంగ్రెస్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రాజగోపాల్‌రెడ్డితో 30, 40 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారన్న వ్యాఖ్యలు కాక రేపాయి. ఈ వ్యాఖ్యలు రాజగోపాల్‌రెడ్డి ఖండిస్తారని గాంధీ భవన్ వర్గాలు భావించాయి. ఆయన ఖండన వ్యాఖ్యల కోసం ఎదురు చూస్తున్న సమయంలో రేవంత్ ప్రభుత్వంపై మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. రూ.లక్షల కోట్లు అప్పు తెచ్చి ఏం చేస్తున్నారని నిలదీశారు.
ఎమ్మెల్యేలుగా తమ పరిస్థితి దారుణంగా ఉన్నదని, రూ.లక్ష, రూ.2 లక్షల పనులకు కూడా తమ దగ్గర నిధుల్లేవని సొంత ప్రభుత్వంపైనే విమర్శలు చేశారు. పెళ్లికి, పేరంటాలకు వెళ్లడం తప్ప ఇతర పనుల మీద గ్రామాలకు వెళ్లలేకపోతున్నామని ప్రభుత్వం మీద సెటైర్లు వేశారు. సరిగ్గా ఇవే అంశాలను ప్రస్తావిస్తూ ఇటీవల కాలంలో యెన్నం శ్రీనివాస్‌రెడ్డి ఒక పత్రికకు వ్యాసం రాశారు. ఆ వ్యాసాన్ని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ట్విట్ చేస్తూ.. యెన్నం అభిప్రాయాలను తాను స్వాగతిస్తున్నానని పేర్కొన్నారు. రాజగోపాల్ రెడ్డి చేసిన ట్వీట్‌ను ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి రీట్వీట్ చేస్తూ స్వాగతించారు. ఈ వ్యవహారం కూడా కాంగ్రెస్‌లో చర్చకు దారి తీసింది.
జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి అవకాశం దొరికినప్పుడల్లా రేవంత్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్లో అవినీతి జరుగుతున్నదని, మంత్రి 30 పర్సెంట్ వాటా అడుగుతున్నారని అప్పట్లో రెండు ఫైళ్లు పట్టుకొని ఏకంగా కాంగ్రెస్ ఎల్పీ సమావేశానికి హాజరు కావడం సంచలనం సృష్టించింది. కొద్దిపాటి భూ సమస్యలున్నా భూమిని ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టి బేరాలు ఆడుతున్నారని, వసూళ్లకు పాల్పడుతున్నారని విమర్శలు చేశారు. రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నత స్థాయిలో ఉన్నవారే ఇలా చేస్తున్నారని వ్యాఖ్యానించారు. భూమి నిషేధిత జాబితాలో ఉంటే 30 శాతం రాయించుకొని క్లియర్ చేస్తున్నారని ఆయన చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి. బనకచర్ల ప్రాజెక్టు విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు కోవర్టులు తెలంగాణలో ఉన్నారని విమర్శలు చేశారు.
ఇరిగేషన్ ప్రాజెక్టులు, రోడ్డు కాంట్రాక్టులు చూసేది వాళ్లేనని, ఆ కోవర్టులకు కరెంట్ కనెక్షన్, నల్లా కనెక్షన్లు కట్ చేయండని చేసిన విజ్ఞప్తి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పడేసింది. మరో సందర్భంలో జడ్చర్ల చుట్టుపకల పేదల అసైన్డ్ భూములను కొందరు కొట్టేస్తున్నారని, అన్యాయం జరిగిన దళితులు, గిరిజనుల కోసం తాను పోరాటం చేస్తున్నట్టు ప్రకటించారు. ‘ఖైదీ నంబర్ 150 సినిమాలో రైతుల భూములను లాకున్న ధనవంతులపై కథానాయకుడు చిరంజీవి పోరాటానికి దిగితే తప్పుడు ఆరోపణలతో ఆయన్నే జైలుకు పంపిస్తారు, ఇప్పుడు జడ్చర్లలోనూ అలాగే జరుగుతున్నది’ అంటూ అనిరుధ్‌రెడ్డి నిత్యం కొత్త అస్ర్తాలతో ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇలా కాంగ్రెస్‌లో కొందరు ఎమ్మెల్యేలు సొంత కుంపటి పెట్టి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తుండటంతో రేవంత్ పాలనా సామర్థ్యంపై కాంగ్రెస్ శ్రేణుల్లో అనుమానాలు పెరుగుతున్నాయి.