పనితీరుపై ఇద్దరికి ‘డీ’, మరొకరికి ‘సీ-గ్రేడ్
మీకేం గ్రేడ్ ఇచ్చిందంటూ అమాత్యుల ఎదురు ప్రశ్న
సీఎం గ్రేడ్‌నూ బయటపెట్టాలని డిమాండ్
హైదరాబాద్, జూన్10 (నమస్తే తెలంగాణ): మంత్రివర్గ సమావేశంలో మాటల యుద్ధం జరిగిందా? ముఖ్యనేత పైన సొంత వర్గం ఎమ్మెల్యేలకే నమ్మకం లేదని ఆయన మంత్రివర్గమే బాంబ్ పేల్చిందా? ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా సంపూర్ణంగా మద్దతు తెలిపే ఎమ్మెల్యేల సంఖ్యా బలం రోజురోజుకు తగ్గిపోతున్నదా? కాంగ్రెస్ పార్టీ అండ లేకుంటే 12 మంది ఎమ్మెల్యేలు కూడా ముఖ్య నాయకుడి చేతిలో ఉండరా? అంటే గాంధీభవన్ వర్గాలు ఔననే అంటున్నాయి. ఇటీవల కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రుల సమావేశం జరిగింది. మంత్రి సీతక్క మినహా మిగిలిన మంత్రివర్గమంతా ఈ సమావేశానికి హాజరైంది.
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వాహణ ఎజెండాగా అత్యవసర సమావేశం ఏర్పాటు చేసిన సీఎం తీరా అక్కడికి వెళ్లాక అధిష్ఠానం రూపొందించిన నివేదిక అంటూ కొన్ని ప్రతులను మంత్రుల ముందు పెట్టినట్టు విశ్వసనీయంగా తెలిసింది. దీన్ని అధిష్ఠానం ప్రగతి నివేదికగా పేర్కొన్నదని, ఇప్పటి వరకు ఆయా శాఖల్లో మంత్రుల పనితీరు, ప్రజలతో మమేకమైన తీరు, అంతిమంగా వారి వలన పార్టీకి ఒనగూరిన లాభం, జరిగిన నష్టం తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని ఏ, బీ, సీ,డీ గ్రేడ్లు ఇచ్చినట్టు మంత్రులకు సీఎం వివరించినట్టు తెలిసింది.
ఉత్తర తెలంగాణకు చెందిన ఒక మంత్రికి, దక్షిణ తెలంగాణకు చెందిన మరో మంత్రికి డీ గ్రేడ్లు, దక్షిణ తెలంగాణ జిల్లాకే చెందిన మరో మంత్రికి ‘సీ గ్రేడ్ వచ్చిందని ఫలితాలను మంత్రుల ముందు పెట్టినట్టు సమాచా రం. సీఎంకు కొంత సమీపంగా ఉండే ఇద్దరు మంత్రులకు మినహా మిగిలిన మంత్రి వర్గం అంతా బీ,సీ,డీ గ్రేడ్లలోనే ఉన్నట్టు తెలిసింది. మంత్రుల పనితీరుపై అధిష్ఠానం దృష్టిసారించిందని సీఎం వారికి చెప్పినట్టు తెలిసింది.
గ్రేడింగ్‌లపై మంత్రులు ఒక్కసారిగా భగ్గుమన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. సీ గ్రేడ్ వచ్చిన దక్షిణ తెలంగాణ జిల్లాకు చెందిన మంత్రిని సీఎంను లక్ష్యంగా చేసుకొని తీవ్రమైన వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది. కాగా, అధిష్ఠానం మంత్రులకు మాత్రమే గ్రేడింగ్ ఇచ్చిందా? మీకు ఇవ్వలేదా అని మంత్రులు నిలదీసినట్టు సమాచారం. రోజు రోజుకు ఎమ్మెల్యేల మద్దతు తగ్గుతున్న మీకు అధిష్ఠానం ఎలాంటి గ్రేడింగ్ ఇచ్చిందని వ్యంగ్యాస్త్రం సంధించినట్టు తెలిసింది. మొదట్లో మీరు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా సంపూర్ణంగా మద్దతు ఇచ్చే 19 మంది ఎమ్మెల్యేల సంఖ్య ఇప్పుడు15కు పడిపోయిందని అంటున్నారని, అధిష్ఠానం మీ పనితనం కూడా పరిగణలోకి తీసుకుని ఉంటుంది గదా? మీ రిపోర్టు కూడా ఇక్కడ పెట్టండని గట్టిగా నిలదీసినట్టు సమాచారం.
సదరు మంత్రి వ్యాఖ్యలకు మద్దతుగా మిగిలిన మంత్రులు గ్రేడింగ్‌పై గట్టిగానే ప్రశ్నించినట్టు తెలిసింది. ఏ పథకం సక్కగ అమలు చేశామని ప్రజలకు చెప్పుకుంటూ తిరగాలని మంత్రులు ఎదురు తిరిగినట్టు తెలిసింది. మనం ఇచ్చిన ఎన్నికల హామీలో భాగంగా యువత కోసం పథకం తీసుకొస్తే, దాన్ని కనీసం పట్టించుకునే పరిస్థితి లేదని మంత్రి ఒకరు నిలదీసినట్టు తెలిసింది. యువతకు ఉపాధి చూపించకుండా స్థానిక ఎన్నికలకు ఎలా వెళ్లగలమని నిలదీసినట్టు సమాచారం. డీ గ్రేడ్ వచ్చిన మంత్రి సభలోనే కన్నీళ్లు పెట్టినట్టు తెలిసింది. ఈ 17 నెలల కాలం నుంచి తనను సుఖంగా ఉండనియ్యలేదని, ఏదో ఒక ఆరోపణతో తనను పలుచన చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేసినట్టు సమాచారం.
‘అరకొర రుణమాఫీ, ఆగిన రైతుభరోసా పెట్టుబడి సాయం, ఎక్కడి ధాన్యం అక్కడే, మళ్లీ ఎరువుల కొరత, విత్తనాల కొరత ఇలా ప్రతి అంశంలోనూ రైతులు మళ్లీ గోస పడుతున్నారు. దీనికి మనమే కారణమనే అభిప్రాయంతో రైతులు ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో జనం వద్దకు పోయి ఏం చెప్పమంటారు’ అని సీనియర్ మంత్రి ఒకరు నిలదీసినట్టు తెలిసింది. రైతుభరోసా పథకాన్ని మూడు ఎకరాల వరకు ఇచ్చి పథకాన్ని అర్ధాంతరంగా నిలిపివేశామని, ఈ పథకం కింద యాసంగి సీజన్‌కు రూ. 9,300 కోట్లు ఇవ్వాల్సి ఉండగా రూ. 5 వేల కోట్లు కూడా పంచలేకపోయామని సదరు మంత్రి ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. రైతుబీమా, విత్తనాలకు సంబంధించి ఆర్థిక శాఖ నుంచి నిధులు విడుదల కాలేదని లెక్కలు చెప్పినట్టు సమాచారం. రైతు పథకాలకు నిధులు ఎందుకు ఇవ్వడం లేదని సీ ఎంను గట్టిగానే నిలదీసినట్టు తెలిసింది.
మెరుగైన ఫలితాలు సాధించని మంత్రులను ఆయా శాఖల నుంచి తప్పించి వారికి వేరే శాఖలు కేటాయించే అవకాశం ఉన్నదని సీఎం రేవంత్ తేల్చి చెప్పినట్టు తెలిసింది. స్థానిక ఎన్నికల్లో వందకు వంద శాతం ఫలితాలు సాధించిన వారికి శాఖల పునర్వ్యవస్థీకరణలో ప్రాముఖ్యత ఉంటుందని అధిష్ఠానం చెప్పమన్నట్టుగా సీఎం ముక్తాయింపు ఇచ్చినట్టు తెలిసింది.